- తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్
గోదావరిఖని, వెలుగు: దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోయిందని, మావోయిస్టులు లేరని ప్రకటించిన తర్వాత కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధాన్ని కొనసాగిస్తున్నాయని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న భార్య, మావోయిస్టు మాజీ నేత రాధక్క(కుర్సుంగే మోతుబాయి) సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రజాసంఘాల ప్రతినిధులు, విరసం నేతలు, పౌర హక్కుల సంఘం నాయకులు, మాజీ మావోయిస్టులు హాజరై రాధక్క ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలని, చట్టబద్ధంగా పాలన సాగించాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కేసీఆర్ పాలనకు భిన్నంగా ఏమీ లేదని ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిర్బంధం ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. సంస్మరణ సభలు నిర్వహించుకుంటే అనుమతించకపోవడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వంలో మార్పు రాకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని అన్నారు.
విరసం సభ్యుడు, ప్రొఫెసర్ కాశీం, మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యులు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, మల్లా రాజిరెడ్డి, సికాస మాజీ సీవో హుస్సేన్, సీఎల్‌సీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, మాదన కుమారస్వామి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం, బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జాతీయ నాయకుడు టి.శ్రీనివాస్, కె.రాజన్న, నరేశ్పాల్గొన్నారు.
