- తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న డొనాల్డ్ ట్రంప్
- వారేం చేసుకున్నా పర్వాలేదని వ్యాఖ్య
వాషింగ్టన్: కీలకమైన హార్మూజ్ జలసంధి భవిష్యత్‌పై గల్ఫ్ దేశాలు ఇరాన్‌తో జరుపనున్న చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించారు. ఆ దేశాలు ఎవరితో సమావేశమైనా తనకేం సంబంధమని, అది వారి ఇష్టమని స్పష్టం చేశారు. సోమవారం ఒమన్‌లో హార్మూజ్ జలసంధిలోని వాణిజ్య నౌకా మార్గాలపై చర్చించేందుకు ఇరాన్, ఇతర పశ్చిమాసియా దేశాలు సమావేశం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌లోని తన గోల్ఫ్ రిసార్ట్‌లో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ.. "నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారేం చేసుకున్నా నాకేం పర్వాలేదు.
ఇజ్రాయెల్, ఇతర మిత్రదేశాలు సంతోషంగా ఉంటే చాలు. చివరకు మేం అక్కడి నుంచి వెళ్లిపోతాం. లేదా వెనిజులా మాదిరిగా అక్కడే ఉండి చమురును నియంత్రించాలని నిర్ణయించుకోవచ్చు" అని అన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధం త్వరలోనే ముగియనుందని, ఆ తర్వాత చమురు ధరలు ఒక్కసారిగా పడిపోతాయని చెప్పారు. ఇరాన్ ప్రస్తుతం ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, నిరంతరం తమను సంప్రదిస్తోందని తెలిపారు. అయితే, తమకు అనుకూలమైన సరైన ఒప్పందం కుదిరితేనే అంగీకరిస్తామని స్పష్టం చేశారు.
నౌకల నుంచి ఫీజులు వసూలు చేయాలని ఇరాన్ పట్టు..
గత ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా–ఇరాన్ యుద్ధానికి ముందు ప్రపంచ చమురు వినియోగంలో ఐదో వంతు హార్మూజ్ జలసంధి మీదుగానే రవాణా అయ్యేది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇరాన్ ఈ జలమార్గాన్ని దిగ్బంధించింది. ఒమన్ చొరవతో జరుగుతున్న ఈ సమావేశంలో నౌకల నుంచి ఫీజులు వసూలు చేయాలని ఇరాన్ కోరుతోంది. అయితే, ఈ భేటీతో ఎలాంటి ఒప్పందం కుదిరే అవకాశం లేదని తెలుస్తోంది.
