హైదరాబాద్, వెలుగు: వివిధ రంగాలకు చెందిన 60 మంది ప్రముఖుల విజయ ప్రస్థానాలతో హైబిజ్ టీవీ ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించింది. కాఫీ టేబుల్ బుక్ పేరుతో తీసుకొచ్చిన ఈ పుస్తకంలో 60 మంది ప్రముఖుల వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలు, వారి నాయకత్వ లక్షణాలు, సాధించిన విజయాలను ఇందులో పొందుపరిచారు. హైదరాబాద్ నానక్రామ్ గూడలోని ప్రధాన్ కన్వెన్షన్సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ హాజరు కాగా, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి వర్చువల్గా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హైబిజ్టీవీ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. పుస్తకంలో చోటు పొందిన ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. తమ ప్రతిభతో వివిధ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖుల కృషి, విజయాలను ప్రజలకు పరిచయం చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతిభావంతులను ప్రోత్సహించడంతో పాటు వారి విజయ ప్రస్థానాలు సమాజానికి చేరువ చేస్తాయన్నారు. హైబిజ్ టీవీ ఫౌండర్ రాజ్ గోపాల్, మేనేజింగ్ డైరెక్టర్ సంధ్యా రాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులను సత్కరించారు.
