- దీనివల్ల కలిగే ప్రమాదాలను గుర్తించాలి
- చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ పక్కన ఉండగానే కామెంట్
- ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడి
- ఢిల్లీలో రెండు రోజుల బ్రిక్స్ సదస్సు ముగింపు
న్యూఢిల్లీ: టెక్నాలజీ, క్రిటికల్ మినరల్స్ను ఆయుధాలుగా వాడొద్దని, అలా చేస్తే బ్రిక్స్ దేశాల ఉమ్మడి అభివృద్ధి, శ్రేయస్సుకు విఘాతం కలుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. వీటిని ఆయుధాలుగా మార్చడం వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించాలని హితవు పలికారు. ఢిల్లీలోని భారత్ మండపంలో భారత్ ఆతిథ్యమిచ్చిన రెండు రోజుల బ్రిక్స్ సమిట్ ఆదివారం ముగిసింది. ముగింపు సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. క్రిటికల్ మినరల్స్, టెక్నాలజీ విషయంలో అన్ని దేశాలు పరస్పర సహకారం ద్వారా ఎదగాలన్నారు.
క్రిటికల్ మినరల్స్ ఎగుమతి, అత్యుత్తమ టెక్నాలజీ అందించే విషయంలో ఆంక్షలు విధిస్తున్న చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్‌తోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో సమక్షంలోనే ప్రధాని ఈ హెచ్చరికలు చేశారు. గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న అత్యవసర సవాళ్లను పరిష్కరించాలని, మానవాళి వికాసానికి కృషి చేయాలని బ్రిక్స్ దేశాలను కోరారు.
పెరుగుతున్న ప్రపంచ సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు. వాటి వల్ల సాధారణ ప్రజల జీవితాలపై ప్రభావం పడకుండా చూసేలా కూటమి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. నేటి రోజుల్లో ఏ సంక్షోభం కూడా ఒక ప్రాంతానికే పరిమితం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా చెలరేగుతున్న అనేక భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు.. విపత్తులు, మహమ్మారులు, సప్లై చైన్ అంతరాయాల వంటివి అన్ని దేశాలను ప్రభావితం చేస్తున్నాయని ప్రధాని చెప్పారు. అమెరికా, -ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ గుండా రాకపోకలు స్తంభించిన నేపథ్యంలో ప్రధాని పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాలో మొదలైన కొవిడ్ మహమ్మారి ప్రపంచం నలు మూలలకూ పాకి లక్షలాది ప్రాణాలను బలిగొన్న విషయాన్ని ప్రస్తావించారు.
బ్రిక్స్ కూటమిలో కీలక నిర్ణయాలు..
బ్రిక్స్ కూటమిలో స్థితిస్థాపకతను పెంపొందించడానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. ఇందులో భాగంగా అంటువ్యాధుల నివారణకు, ప్రతిస్పందనకు ‘బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’పై ఏకాభిప్రాయం కుదిరిందని ప్రకటించారు. ‘‘బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ కోఆపరేషన్ ఫ్రేమ్‌వర్క్ సరఫరా గొలుసులను మరింత నమ్మదగినవిగా, స్థితిస్థాపకంగా మార్చడానికి సహాయపడుతుంది. ఆవిష్కరణలు, పరిష్కారాలను ప్రోత్సహించడానికి బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ప్రతిపాదించాం” అని మోదీ తెలిపారు. అలాగే, డిజిటల్ వ్యవసాయంపై బ్రిక్స్ నెట్‌వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, దీని ద్వారా ఏఐ, జియో స్పేషియల్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రైతు అవసరాలకు అనుసంధానమవుతాయని చెప్పారు. ‘‘బ్రిక్స్ కనెక్ట్ ద్వారా నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, శ్రామిక శక్తిలో మహిళలు, సామాజిక భద్రత, సామర్థ్య పెంపును ప్రోత్సహించాం.
కొత్త మార్కెట్లతో అనుసంధానించడానికి బ్రిక్స్ ఎంఎస్ఎంఈ కోఆపరేషన్ పోర్టల్‌ను ప్రారంభించాం. మన నగరాల మధ్య ఉత్తమ పద్ధతుల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ ఏర్పాటు చేశాం. స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వ కోసం బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశాం” అని ప్రధాని వివరించారు. కాగా, ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతానికి, జీడీపీలో 40 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 11 ప్రముఖ వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కూటమైన బ్రిక్స్ వార్షిక సదస్సు.. లాజిస్టిక్స్ సరఫరా గొలుసులు, స్టార్టప్‌లు, అంటువ్యాధుల నియంత్రణలో కీలక ఫలితాలతో ముగిసింది. కాగా, 2027లో జరిగే బ్రిక్స్ సదస్సుకు చైనా ఆతిథ్యం ఇవ్వనుంది.
.మధ్యవర్తిత్వానికి మోదీ, జిన్‌పింగ్ ఆఫర్.. రష్యా ఓకే
రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ జిన్‌పింగ్ సంసిద్ధత వ్యక్తం చేశారని రష్యా అధ్యక్ష భవనం ‘క్రెమ్లిన్’ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. మోదీ, జిన్‌పింగ్ నిర్ణయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన నిరంతర ప్రయత్నాలు వ్యర్థమైన నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడిందని ‘రాయిటర్స్’ వార్తా సంస్థ పేర్కొంది.
కాగా, మోదీ, జిన్‌పింగ్, పుతిన్‌లను విశ్లేషకులు ‘పవర్ ట్రయో’గా అభివర్ణించగా.. వారు బ్రిక్స్ వేదికగా చూపిన సాన్నిహిత్యం స్పష్టంగా కనిపించింది. మరోవైపు, వచ్చే డిసెంబర్‌లో అమెరికాలో జరిగే జీ20 సమిట్‌లో పుతిన్‌తో భేటీకి తాను సిద్ధమేనని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ శనివారం వెల్లడించారు. కానీ, వీరి భేటీ అసాధ్యమని దిమిత్రీ పెస్కోవ్ వెంటనే తేల్చిచెప్పారు.
