సీఎంను ఎదుర్కోలేకే బీఆర్ఎస్ ‘మాక్ అసెంబ్లీ’: ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

సీఎంను ఎదుర్కోలేకే బీఆర్ఎస్ ‘మాక్ అసెంబ్లీ’: ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ములేక బీఆర్ఎస్  ఎమ్మెల్యేలు తమ పార్టీ ఆఫీస్ లో మాక్  అసెంబ్లీ నిర్వహించాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఎద్దేవా చేశారు. ఆదివారం యాదగిరిగుట్టలోని తన ఇంట్లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్​ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో అధికారపక్షాన్ని తట్టుకునే ధైర్యం లేక సెషన్స్  నుండి సస్పెండ్  కావాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్  ఎమ్మెల్యేలు స్పీకర్  పోడియం ముట్టడించి బహిష్కరణకు గురయ్యారని తెలిపారు. 

అసెంబ్లీలో ప్రజల సమస్యలపై, 22ఏపై చర్చిస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్  ఎందుకు పారిపోయిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్  చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్  నాయకులకు అధికార వ్యామోహం తగ్గలేదని, అందుకే కేసీఆర్  అసెంబ్లీ సెషన్స్ కు కంటిన్యూగా డుమ్మా కొడుతున్నారని మండిపడ్డారు. ప్రధాన పతిపక్ష పాత్రను సరిగా నిర్వర్తించకుంటే, ప్రజలు బీఆర్ఎస్ కు అసెంబ్లీలో శాశ్వతంగా స్థానం లేకుండా చేస్తారని తెలిపారు.