టీఆర్ఎస్లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి

టీఆర్ఎస్లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి
  • సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి కవిత సమక్షంలో చేరిక
  • అక్టోబర్​లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ

హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్​జిల్లాలోని ప్రముఖ నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మెస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్ లోని పార్టీ ఆఫీసులో సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి  ఆయన పార్టీలో జాయిన్​ అయ్యారు. వారికి టీఆర్ఎస్​ చీఫ్ కల్వకుంట్ల కవిత కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కవిత నాగోబా భక్తురాలు కావడంతో.. ఆదిలాబాద్​ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి నాగోబా ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.

ఈ క్రమంలో ఆ ఆలయ ప్రధాన పూజారి పార్టీలో చేరడం తమకు మంచి పరిణామమని కవిత అంటున్నారు. మెస్రం ఆనందరావుతోపాటు గిన్నెర గ్రామ సర్పంచ్ మెస్రం భీంరావు, ముత్తనూరు సర్పంచ్ రిట్టె విఠల్, ఆసోద సర్పంచ్ నగేశ్ తదితరులు టీఆర్ఎస్​లో చేరారు. కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తదితరులు పాల్గొన్నారు. 

గోండులు, బంజారాలపై ఫోకస్​

అక్టోబర్​లో ఇంద్రవెల్లి కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కవిత కసరత్తులు చేస్తున్నారు. నిజామాబాద్ లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ సక్సెస్  కావడంతో ఈ నెల 20న తొలుత కొడంగల్​ నియోజకవర్గంలోని కోస్గిలో మరో సభకు సన్నాహకాలు చేస్తున్నారు. ఆ తర్వాత అక్టోబర్ లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కొడంగల్​ సభ తర్వాత ఇంద్రవెల్లి సభ తేదీని ప్రకటించనున్నారు. ఈ సభ ద్వారా ఆదివాసీలు, ముఖ్యంగా గోండులు, బంజారాలను పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్చుకునేలా కవిత కసరత్తులు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.