మక్తల్, వెలుగు: మక్తల్ను అన్నిరంగాల్లో అభివృద్ది చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం పట్టణంలోని మూడో వార్డులో రూ 2.50 కోట్లతో చేపట్టిన రోడ్డు, కల్వర్టు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు రోడ్లు, డ్రైనేజీలు, బ్రిడ్జిల నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. రోడ్ కం బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో మూడో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం ఊట్కూరు మండలంలో అభివృద్ధి పనులపై మంత్రి రివ్యూ చేశారు. గ్రామాల వారీగా సర్పంచులు, నాయకులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అవసరాలు, పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, విద్య, ప్రజా అవసరాలపై దృష్టి సారిస్తామని తెలిపారు.
ఊట్కూరు మండలాన్ని అన్నిరంగాల్లో డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమలంలో 229 మంది లబ్ధిదారులకు రూ.88.97 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, మంత్రి సతీమణి వాకిటి లలిత, నాయకులు బాలకృష్ణారెడ్డి, కోళ్ల వెంకటేశ్ పాల్గొన్నారు.
