ఆసియా కప్ మనదే.. ఎనిమిదో టైటిల్ సాధించిన అమ్మాయిలు

ఆసియా కప్ మనదే.. ఎనిమిదో టైటిల్ సాధించిన అమ్మాయిలు
  • ఫైనల్లో శ్రీలంకపై 72 పరుగులతో ఘన విజయం
  •  షెఫాలీ, స్మృతి మెరుపు బ్యాటింగ్‌‌

దుబాయ్: బ్యాట్‌‌తో పరుగుల వరద పారించిన భారత అమ్మాయిలు.. బంతితో శ్రీలంకను కట్టడి చేశారు. ఫైనల్లో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్‌‌ను ముద్దాడారు. ఈ విజయంతో భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా రాణిగా నిలిచింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (68), వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (59) అర్ధశతకాలతో విరుచుకుపడగా.. అనంతరం బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక 111 పరుగులకే ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణి 4/20తో లంక బ్యాటింగ్ వెన్నువిరిచింది.

షెఫాలీ.. స్మృతి జోరు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. షెఫాలీ వర్మ, స్మృతి మంధాన కలిసి తొలి వికెట్‌‌కు కేవలం 12.5 ఓవర్లలోనే 129 పరుగులు జోడించారు. షెఫాలీ ఆరంభం నుంచే బౌండరీలతో విరుచుకుపడింది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు వేసిన తొలి ఓవర్లోనే వరుసగా 6, 6, 4 బాదిన షెఫాలీ.. పవర్‌‌ప్లే ముగిసేసరికి భారత్‌‌ను 57 పరుగులకు చేర్చింది. 22 ఏళ్ల షెఫాలీ కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసింది. మరోవైపు తొలుత షెఫాలీకి సహకరిస్తూ ఆడిన మంధాన.. భాగస్వామి అర్ధశతకం తర్వాత గేర్ మార్చింది. నీలాక్షి సిల్వా బౌలింగ్‌‌లో సిక్స్, ఆటపట్టు బౌలింగ్‌‌లో అద్భుతమైన ఇన్‌‌సైడ్-అవుట్ కవర్ డ్రైవ్‌‌తో బౌండరీ బాదిన మంధాన.. 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసింది. 

వరుసగా రెండు వికెట్లు

భారత్ 129 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రసిద్ధా బౌలింగ్‌‌లో షెఫాలీ నేరుగా ఆటపట్టుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ వెంటనే మంధాన కూడా రనౌట్‌‌గా పెవిలియన్ చేరింది. కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ కౌర్‌‌తో రన్ కోసం గందరగోళంలో మంధాన వికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది. 15 ఓవర్లకు భారత్ 140/2తో పటిష్ట స్థితిలో ఉంది. చివరి ఐదు ఓవర్లలో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ వేగం కొంత తగ్గింది. రిచా ఘోష్ 17 పరుగులు చేయగా.. గునాలన్ కమలిని కేవలం 5 బంతుల్లో 15 పరుగులు చేసి భారత్ స్కోరును 183/5కు చేర్చింది.

 చరణి స్పిన్ మ్యాజిక్

184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు కెప్టెన్ చమరి ఆటపట్టు, విష్మి గుణరత్నె మాత్రమే రాణించారు. రెండో వికెట్‌‌కు 58 పరుగులు జోడించారు. కానీ దీప్తి శర్మ పదో ఓవర్లో ఆ జోడీని విడదీసింది. ఆటపట్టు (36)ను స్టంపౌట్ చేయించిన దీప్తి.. మూడు బంతులకే గుణరత్నెను బౌల్డ్ చేసింది. దీంతో 10 ఓవర్లకు శ్రీలంక 63/3తో నిలిచింది. అప్పటికే రన్‌‌రేట్ 12 దాటడంతో లంక విజయంపై ఆశలు సన్నగిల్లాయి. ఆ తర్వాత శ్రీ చరణి 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. 20 ఓవర్లలో 111 పరుగులకే లంక ఆలౌటయింది. 

 భారత్: 183/5 (20 ఓవర్లు)
 షెఫాలీ వర్మ 68, స్మృతి మంధాన 59
శ్రీలంక: 111 ఆలౌట్ (20 ఓవర్లు)
 చమరి ఆటపట్టు 36, శ్రీచరణి 4/20