దళితులపై వివక్షను సహించం .. అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి: ధర్నాచౌక్‌‌‌‌ దగ్గర దళిత సంఘాల భారీ నిరసన

దళితులపై వివక్షను సహించం .. అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి: ధర్నాచౌక్‌‌‌‌ దగ్గర దళిత సంఘాల భారీ నిరసన

దళితులకు బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలి
రాజ్యాంగాన్ని అవమానిస్తే ఊరుకోం: హరగోపాల్
మాల, మాదిగలు ఐక్యంగా పోరాడాలి: అద్దంకి దయాకర్
కేసీఆర్ ఫామ్‌‌‌‌హౌస్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ ఇందిరాపార్క్‌‌‌‌ ధర్నాచౌక్‌‌‌‌ వద్ద దళిత సంఘాల భారీ నిరసన

ముషీరాబాద్, వెలుగు:  దళితులపై వివక్షను చూపితే సహించేది లేదని పలువురు నేతలు హెచ్చరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌‌‌‌రెడ్డిల శాసనమండలి సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, కేసీఆర్ ఫామ్‌‌‌‌హౌస్ వద్ద దళితులు నిరసన వ్యక్తం చేసిన స్థలాన్ని బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం ఇందిరాపార్క్‌‌‌‌ ధర్నాచౌక్‌‌‌‌ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ దళితులపై వివక్ష చూపే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో దళిత సంఘాలన్నీ ఐకమత్యంగా ఉద్యమాలు, పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. 

దళితులపై వివక్ష దుర్మార్గం: మల్లు రవి

ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్‌‌‌‌హౌస్ పరిసర ప్రాంతాల్లో దళితులు నిరసన వ్యక్తం చేసిన ప్రాంగణాన్ని పసుపు నీళ్లతో శుభ్రం చేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం సుమోటాగా కేసు స్వీకరించి ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 80 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో నేటికీ దళితుల పట్ల వివక్ష కొనసాగడం అత్యంత దుర్మార్గమన్నారు. బీఆర్ఎస్ పార్టీ దళితులకు క్షమాపణ చెప్పిన తర్వాతే దళిత వాడల్లో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్‌‌‌‌ది దళిత వ్యతిరేక వైఖరి: వేముల వీరేశం

ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ వైఖరి మొదటి నుంచి దళిత వ్యతిరేకమని అన్నారు. తెలంగాణకు మొదటి సీఎంగా దళితున్ని చేస్తానని హామీ ఇచ్చి దళితులను మాజీ సీఎం కేసీఆర్ మోసం చేశారని గుర్తు చేశారు. స్టేషన్ ఘన్‌‌‌‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి మధ్యలోనే కారణం లేకుండా బర్తరఫ్ చేశారని తీవ్రంగా విమర్శించారు. అదేవిధంగా బీసీ అయిన ఈటల రాజేందర్‌‌‌‌ను మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తూ.. కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు.

రాజ్యాంగాన్ని అవమానించడమే: హరగోపాల్

ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. దేశంలో దళితులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న సభా వేదికను బీజేపీ నేతలు శుద్ధి చేయడం, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌‌‌‌హౌస్ వద్ద దళితులు నిరసన వ్యక్తం చేస్తే ఆ ప్రాంగణాన్ని బీఆర్ఎస్ నేతలు శుద్ధి చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. ఈ ఘటనలపై దళితులంతా ఐకమత్యంగా పోరాటాలు చేయాలని, వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. రాజ్యాధికారం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందన్నారు.
 
దళిత హక్కులు అమలైనప్పుడే రాజ్యాంగం సంపూర్ణం: కోదండరాం

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపర్చిన దళిత హక్కులు వారి జీవితాల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలైనట్లు అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. మాల, మాదిగలు ఐక్యంగా ఉండి వారి హక్కుల కోసం పోరాటాలు చేయాలన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ.. బహుజనుల బతుకులు బజారుకీడ్చిన వ్యక్తులంతా కేసీఆర్ పక్షాన చేరారని విమర్శించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాట్లాడుతూ.. కుల వివక్షకు వ్యతిరేకంగా జిల్లాల వారీగా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, కె.ఆర్. నాగరాజు, పిడమర్తి రవి పాల్గొన్నారు.