- సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్
సైఫాబాద్, వెలుగు: గ్రామపంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమని సర్పంచుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సాధని భూమన్న యాదవ్ అన్నారు. గ్రామపంచాయతీలకు వచ్చే నిధులను పంచాయతీల ఖాతాల్లోనే జమ చేసేలా చర్యలు తీసుకోవడం హర్షనీయమన్నారు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
లక్డీకాపూల్‌లోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో భూమన్న యాదవ్ మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంతో సర్పంచుల అధికారాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఉపసర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం వల్ల సర్పంచులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బకాయిలు చెల్లించకపోవడంతో పలువురు తీవ్ర ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం అదే బకాయిల అంశాన్ని ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు సర్పంచులను రెచ్చగొడుతున్నారని భూమన్న యాదవ్ విమర్శించారు.
ఉపసర్పంచ్‌తో ఉన్న జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేసి, పంచాయతీ కార్యదర్శితో జాయింట్ చెక్ పవర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం సర్పంచ్ కర్నె జ్యోతిని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
