న్యూఢిల్లీ: ఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఆదివారంతో విజయవంతంగా ముగిసింది. ఈ సమిట్‌లో 'న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026' ఏకగ్రీవంగా ఆమోదం పొందడం భారతదేశానికి గొప్ప దౌత్యపరమైన విజయంగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం 72 గంటల వ్యవధిలో పుతిన్, జిన్‌పింగ్ సహా 15 దేశాల నేతలతో కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. పుతిన్, జిన్‌పింగ్ సహా నేతలతో మంతనాలు తొలిరోజు రష్యన్ అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన భేటీలో 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చడంపై చర్చించారు.
అలాగే ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్, ఐరాస చీఫ్ గుటెర్సెస్‌తో సమావేశమై ప్రాంతీయ ఉద్రిక్తతలు, భద్రతా మండలి సంస్కరణలపై మాట్లాడారు. రెండో రోజు ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ సమావేశమై సరిహద్దు భద్రత, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
ఇథియోపియా, మలేషియా, యూఏఈ, వియత్నాం నేతలతోనూ భేటీ అయ్యారు. ఇరాన్, యూఏఈ మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పక్కనపెట్టి డిక్లరేషన్‌పై పూర్తి ఏకాభిప్రాయం సాధించడం విశేషం. ముగింపు వేడుకల్లో రష్యా, చైనా అధినేతలతో కలిసి మోదీ దిగిన ‘ఫ్యామిలీ ఫొటో’ బ్రిక్స్ దేశాల ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. సదస్సు ముగింపునకు ముందు ఇండోనేసియా, సౌతాఫ్రికా, ఈజిప్ట్ అధినేతలతోనూ మోదీ సమావేశమయ్యారు.
