- 22ఏ భూములపై ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి
- బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల విషయంలో ప్రభుత్వం వెల్లడిస్తున్న లెక్కల్లో తీవ్ర వైరుధ్యాలు, గందరగోళం నెలకొన్నాయని.. దీనిపై ప్రజలకు వెంటనే క్లారిటీ ఇవ్వాలని బీజేపీ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్ల వారీగా 22ఏ నిషేధిత భూములపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి ఎంత భూమిని తొలగించారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలన్నారు.
2023 డిసెంబరు 7 నాటికి 1,02,52,690 ఎకరాలు ఉండగా.. 2026 ఆగస్టు 31 నాటికి1,02,05,250 ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపిందన్నారు. అంటే అధికారిక లెక్కల ప్రకారం తగ్గింది కేవలం 47,440 ఎకరాలు మాత్రమేననీ, కానీ, ఇటీవల మీడియాలో దాదాపు 5 లక్షల ఎకరాలు తగ్గినట్లు వార్తలు వచ్చాయని చెప్పారు. ప్రభుత్వ వ్యవసాయ భూమి 96,36,777 ఎకరాలు, ప్రైవేటు వ్యవసాయ భూమి 3,73,930 ఎకరాలు, వ్యవసాయేతర భూమి 1,94,543 ఎకరాలు కలిపి 1.02 కోట్ల ఎకరాలుగా పేర్కొన్నారు. అయితే ఇందులో ప్రస్తావించిన 5,12,792 ఎకరాల దేవాదాయ భూములు ఏ వర్గంలో ఉన్నాయో స్పష్టం చేయలేదన్నారు.
ఎన్ని రిజిస్ట్రేషన్లు ఆగినయ్?
ఏప్రిల్– ఆగస్టు 2025లో రూ.6,216 కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్ల ఆదాయం.. 2026 నాటికి రూ.7,575 కోట్లకు పెరగడం సహజమేనని, జూన్ 5 నుంచి ప్రభుత్వం మార్కెట్ విలువలను సవరించడంతోనే ఆ రాబడి పెరిగిందని గుర్తుచేశారు. 22ఏ కారణంగా ఎన్ని రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.. ఎన్ని దరఖాస్తులను తిరస్కరించారు? ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో వివరాలు బహిర్గతం చేయాలని కోరారు. డేటా అప్‌డేట్ పేరుతో గతంలో రిజిస్ట్రేషన్ అవుతున్న ఎన్ని ప్రైవేట్ ఆస్తులు కొత్తగా ఆ యాక్ట్ పరిధిలోకి వెళ్లాయో ప్రభుత్వం చెప్పాలన్నారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
