ధరణి దందాలపై సర్కారు కొరడా.. భూ బకాసురులపై క్రిమినల్ కేసులు

ధరణి దందాలపై సర్కారు కొరడా.. భూ బకాసురులపై క్రిమినల్ కేసులు

 

  • అక్రమాల చిట్టా ఆధారంగా త్వరలో చర్యలు
  • బీఆర్ఎస్ హయాంలో 23 వేల ఎకరాలు హాంఫట్​
  • ప్రభుత్వ, అసైన్డ్​ భూములు కాజేసిన గులాబీ లీడర్లు
  • డిఫెన్స్,​ భూదాన్, ఇనాం ల్యాండ్స్​నూ వదల్లేదు
  • ఫోరెన్సిక్​ ఆడిట్, సిట్​ నివేదిక ఆధారంగా అరెస్టులు?

 

హైదరాబాద్, వెలుగు:  ధరణి పోర్టల్ వ్యవహారం గత పాలకుల మెడకు ఉచ్చులా బిగుస్తోంది. పారదర్శకత ముసుగులో తెచ్చిన ధరణి పోర్టల్‌‌‌‌ను అడ్డం పెట్టుకుని వేలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, పేదల భూములను స్వాహా చేసిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ముఖ్య నేతలపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధమైంది. శాసనసభలో భూ కుంభకోణాలపై రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వివరాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ధరణి అక్రమాలపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్, 10 వేల వివాదాస్పద లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం రూపొందించిన నివేదికల ఆధారంగా అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

బినామీల పేరిట వేల కోట్ల ఆస్తులు..

రైతులకు భరోసా ఇవ్వాల్సిన డిజిటల్ వ్యవస్థను అప్పటి రాజకీయ పెద్దలు తమ బినామీల పేరిట వేల కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టుకునే అక్రమ సాధనంగా మార్చుకున్నారు. 

 అంతేకాకుండా ఇటీవల 22ఏ భూముల విషయంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా ఆరోపణలు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌‌‌‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సాక్షిగా మంత్రి బయటపెట్టిన ఆధారాల ప్రకారం.. రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ, అసైన్డ్, ఇనాం, భూదాన్, డిఫెన్స్ భూములను తమ స్వార్థం కోసం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన లిస్టులో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు వారి బంధువుల పేర్లు ఉన్నాయి.

 ఈ వ్యవహారంతో గులాబీ దళం తలపట్టుకోగా, అక్రమార్కులను చట్టం ముందు నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ధరణిలో సుమారు 23 వేల ఎకరాల మేర అక్రమాలు జరిగాయని సెట్ నివేదిక నిర్ధారించడంతో, సదరు లావాదేవీల వెనుక పొలిటికల్ లీడర్లు ఎవరున్నారు..? ఎవరి పేర్ల మీద జరిగాయి..? అధికారులు, రాజకీయ నాయకులు అందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం. స్పెషల్ ఎంక్వైరీ టీమ్ ఇచ్చే పూర్తిస్థాయి నివేదిక ఆధారంగా, ప్రజల సొత్తును దోచుకున్న ఎంతటి బీఆర్ఎస్ నాయకులైనా సరే ఉపేక్షించకుండా జైలుకు పంపడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

ఇష్టారాజ్యంగా భూముల వర్గీకరణ..

గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌‌‌‌ను అడ్డంపెట్టుకొని అప్పటి అధికార పార్టీ పెద్దలు, వారి బంధువులు భూముల వర్గీకరణను ఇష్టారాజ్యంగా మార్చేశారు. మాజీ మంత్రి టి.హరీశ్ రావు మామ మాధవరం హనుమంతరావు కుటుంబానికి ప్రయోజనం చేకూర్చేందుకు కొండపాక మండలం వేలికట్ట గ్రామంలోని 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న 4.32 ఎకరాల విలువైన భూమిని 2023 ఆగస్టులో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తొలగించి, రాత్రికి రాత్రే ప్రైవేట్ పట్టా భూమిగా మార్చేశారు. ఒక ఎకరా 26 గుంటలకు రూ.11.92 లక్షల నష్టపరిహారం చెల్లించిన తర్వాత మిగిలిన భూమిని దొడ్డిదారిన క్రమబద్ధీకరించారని ఆధారాలతో మంత్రి శనివారం సభలో వెల్లడించారు. ఈ తరహా భూమార్పిడిలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టి, నిషేధిత భూములను తమ ఖాతాలో వేసుకున్నారని స్పష్టం చేశారు.

ఇనాం భూమిపై అక్రమంగా హక్కులు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు, విద్యాసంస్థల మేనేజ్‌‌‌‌మెంట్లు, బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లబ్ధిదారులుగా ఉన్న పలు భూవ్యవహారాల్లో తీవ్ర అక్రమాలు జరిగినట్లు అసెంబ్లీలో సమర్పించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. మెదక్ జిల్లా శివంపేట మండలం సికిండ్లాపూర్‌‌‌‌లో దాదాపు 372.32 ఎకరాల విలువైన ఇనాం భూమిపై బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా హక్కులు పొందేందుకు ప్రయత్నాలు జరిగినట్లు అటు ఫోరెన్సిక్ అటు సిట్ విచారణలో తేలినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ వ్యవహారంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, ప్రస్తుతం నర్సాపూర్ ఆర్డీవో ఎదుట విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా శంకర్ హిల్స్ వద్ద వివాదాస్పద భూములు, వట్టినాగులపల్లి భూదాన్ భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించి బీఆర్ఎస్ నేతలకు ప్రయోజనం చేకూర్చడానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భూ దందా నడిపారని రిపోర్టులో వెల్లడైంది. 

డిఫెన్స్, అసైన్డ్​ భూములూ కబ్జా..

హైదరాబాద్ శివార్లు, చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న రక్షణ శాఖ భూములు (డిఫెన్స్ ల్యాండ్స్), మునగనూరులోని అసైన్డ్ భూములు, తుంకుం టలోని మిలిటరీ స్థలాలను కూడా వదలకుండా బీఆర్ఎస్ నేతలు కబ్జాలకు పాల్పడ్డారు. తుం కుంట డిఫెన్స్ భూమిని సైతం ఎలాంటి పత్రాలు లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేలా ధరణి పోర్టల్‌‌‌‌లో మార్పులు చేశారు. గత తొమ్మిదేండ్లలో అసైన్డ్ భూములను సైతం తమ పేరిట మార్చుకుని, ప్రైమ్ లొకేషన్లలో ఉన్న 50కి పైగా విలువైన ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకున్న దానిపై ప్రస్తుతం ప్రభుత్వం సీరి యస్‌‌‌‌గా తీసుకున్నది. హైకోర్టు తీర్పులను కూడా తుంగలో తొక్కి 22-ఏ నిషేధిత జాబితాను ఏ, బీ, సీ, డీ, ఈ లుగా విభజించకుండా కాలయాపన చేసినట్లు అనుమానిస్తున్నారు. ధరణి వ్యవస్థను అడ్డం పెట్టుకుని బోగస్ పాస్‌‌‌‌ బుక్‌‌‌‌లు సృష్టించి రైతుబంధు నిధులను కూడా దోచుకున్నట్లు తేలింది. మరోవైపు అల్వాల్‌‌‌‌తోపాటు పలు ప్రాంతాల్లో ప్రాహిబిటెడ్ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై ఇప్పటికే చర్యలు.