- సైబర్ మోసాల బాధితులకు రూ.42.29 కోట్ల రీఫండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మూడో జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 1,51,164 కేసులు పరిష్కారమైనట్టు సీఐడీ డీజీ చారుసిన్హా తెలిపారు. ఇందులో 1,47,268 సాధారణ కేసులతో పాటు 3,896 సైబర్ మోసాల కేసులు పరిష్కారమైనట్టు పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో భాగంగా సెప్టెంబర్ 3న ప్రారంభమైన పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 12న ముగిసినట్టు ఆదివారం తెలిపారు. సైబర్ మోసాల కేసుల్లో 3896 మంది బాధితులకు రూ.42.29 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించారు. కేసుల పరిష్కారంలో హైదరాబాద్ పోలీసు యూనిట్ అత్యధికంగా 15,944 కేసులతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఖమ్మం 10,955, గద్వాల 8,469, వరంగల్ 8,404, మల్కాజిగిరి 8,109 కేసులతో వరుసగా నిలిచాయి.
