- 6,660 మందికి పరిశీలన పూర్తి.. 5,521 మంది అర్హులు
- బ్రోకర్లు, మధ్యవర్తులను నమ్మొద్దు: హౌసింగ్ బోర్డు వీసీ గౌతమ్
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ టవర్స్ ఎల్‌ఐజీ గృహాల లబ్ధిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు జారీ చేయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. లక్కీ డ్రా ద్వారా మొత్తం 7,340 మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. ఇప్పటివరకు 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందన్నారు. ఇందులో 5,521 మంది అర్హులుగా నిర్ధారించినట్లు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మిగిలిన అభ్యర్థుల పరిశీలనను కూడా ఈ వారంలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వారికి అధికారిక కేటాయింపు పత్రాలు జారీ చేస్తామని గౌతమ్ తెలిపారు. లక్కీ డ్రాలో ఎంపికైన వారు తమకు ఇల్లు వస్తుందా? లేదా? అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, అర్హత నిర్ధారణ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే జరుగుతున్నదని స్పష్టం చేశారు.
అధికారిక ఖాతాకే డబ్బులు..
గృహానికి సంబంధించిన మొదటి విడత చెల్లింపు మొత్తం, బ్యాంకు ఖాతా వివరాలు, గడువు తదితర వివరాలను కేటాయింపు పత్రంతోపాటే అధికారికంగా తెలియజేస్తామని గౌతమ్ తెలిపారు. పత్రంలో పేర్కొన్న అధికారిక బ్యాంకు ఖాతాకు మాత్రమే నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలని సూచించారు. ఇతరులు చెప్పే ఖాతాలకు, వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేయొద్దని హెచ్చరించారు. ఇల్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగినా.. అనధికారిక ఖాతాకు డబ్బులు చెల్లించాలని కోరినా వెంటనే తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అధికారిక సమాచారాన్నే నమ్మాలి..
గృహాల కేటాయింపు, క్షేత్రస్థాయి పరిశీలన, కేటాయిం పు పత్రాలు, మొదటి విడత చెల్లింపు తదితర వివరాల కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్‌ను లేదా 040-24603572 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని గౌతమ్ సూచించారు. బోర్డు అధికారికంగా విడుదల చేసే ప్రకటనలు, కేటాయింపు పత్రాలు, అధికారుల సూచనలను పాటించాలని లబ్ధిదారులను కోరారు.
బ్రోకర్ల మాటలు నమ్మొద్దు..
గృహాలు ఇప్పిస్తామని, అధికారులతో మాట్లాడి పని చేయిస్తామని కొందరు బ్రోకర్లు, మధ్యవర్తులు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. గృహాల కేటాయింపు ప్రక్రియలో బ్రోకర్లు, మధ్యవర్తులకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. “లబ్ధిదారులు ఎవరికీ లంచం, కమీషన్ లేదా ఇతర రూపాల్లో డబ్బులు ఇవ్వొద్దు. గృహాల కేటాయింపు ప్రభుత్వ నిబంధనలు, అర్హతలు, అధికారిక ప్రక్రియ ఆధారంగానే జరుగుతుంది” అని చెప్పారు.
