కొచ్చి: రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తనకు తానే ‘దిమాగీ నక్సల్’గా అభివర్ణించుకున్నారు. వ్యవస్థలో చొరబడి, విధానాలను ప్రభావితం చేస్తూ సమాజానికి ముప్పుగా మారుతున్నారని ఆరోపించే ‘దిమాగీ నక్సల్స్’ను గుర్తించి, వారిని ఒంటరి చేయాలని గతంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
కొచ్చిలో కపిల్ మాట్లాడుతూ హార్స్ ట్రేడింగ్ అనేది రాజ్యాంగ సంక్షోభమన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, ఓటు పవిత్రతకు ముప్పుగా మారుతోందన్నారు. డబ్బు, పదవులు, దర్యాప్తుల నుంచి రక్షణ వంటి ప్రలోభాలతో ఎమ్మెల్యేలను ఆకర్షించి కృత్రిమ మెజారిటీని ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. పౌరుడు ఒకరికి ఓటేస్తే, అధికారం చివరకు మరొకరి చేతికి వెళ్తోందన్నారు.
