- అర్బన్, రూరల్ ఏరియాలకు అనామలీస్ కమిటీలు
- బహిరంగ మార్కెట్‌కు అనుగుణంగా రేట్లు
- సవరించిన రేట్ల ప్రకారమే పరిహారం
- భూ నిర్వాసితులకు భారీ ఊరట
యాదాద్రి, వెలుగు: భూ నిర్వాసితులకు మరింత ఊరట కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రాజెక్టుల కోసం సేకరించే భూముల రేట్లను సవరించేందుకు చర్యలు తీసుకుంటోంది. అర్బన్, రూరల్ ఏరియాలకు వేర్వేరుగా మార్కెట్ విలువల సవరణ కోసం అనామలీస్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. రేట్లను సవరించిన అనంతరం పరిహారం నిర్ణయించనున్నారు.
తాజాగా మరిన్ని ప్రాజెక్టులు
యాదాద్రి జిల్లాలో ఇప్పటికే బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్‌తో పాటు బునాదిగాని, ధర్వారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు రీజినల్ రింగ్ రోడ్(ట్రిపుల్ ఆర్), రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోఆర్), ఎంఎంటీఎస్ వంటి ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఆయా ప్రాజెక్టులకు సేకరించే భూములకు నిర్ణయించిన పరిహారం నిర్వాసితుకు విడతల వారీగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్బిట్రేషన్‌లో పెంచిన పరిహారం కూడా నిర్వాసితులకు అందిస్తున్నారు.
తాజాగా జిల్లాలో మరిన్ని ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. చౌటుప్పల్, బీబీనగర్ మండలాల్లో కొత్తగా కాల్వల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అలాగే హైదాబాద్–-కాజీపేట రైలు మార్గంలో 110 కిలోమీటర్ల వరకు మల్టీ ట్రాకింగ్(నాలుగో లైన్) ప్రాజెక్టుకు కేంద్రం ఓకే చెప్పింది. దీంతో జిల్లాలోని బీబీనగర్ నుంచి ఆలేరు మండలం పటేల్‌గూడెం వరకు 40 కిలోమీటర్ల వరకు కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉంటుంది.
నాలుగేండ్ల తర్వాత..
వ్యవసాయ, కమర్షియల్ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వాల్యూ, బహిరంగ మార్కెట్ విలువకు మధ్య భారీ తేడా ఉంది. గత బీఆర్ఎస్ సర్కారు 2021–2022లో భూముల విలువను సవరించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవలే 25 శాతం నుంచి వంద శాతానికి మించి సవరించింది. దీంతో ప్రాజెక్టుల కోసం సేకరించే భూమికి నిర్ణయించిన పరిహారం సరిపోవడం లేదని కలెక్టర్ నేతృత్వంలోని ఆర్బిట్రేషన్‌ను నిర్వాసితులు ఆశ్రయించడంతో అమౌంట్ పెంచుతున్నారు.
రివైజ్డ్ రేట్ల ఆధారంగా పరిహారం..
అర్బన్, రూరల్ ఏరియాల్లో కొత్తగా వచ్చిన ప్రాజెక్టులకు వ్యవసాయ, వ్యవసాయేతర భూసేకరణకు చెల్లించే పరిహారంపై ఈ అనామలీస్కమిటీలు నిర్ణయం తీసుకుంటాయి. ఆయా ప్రాంతాల్లో మూడేండ్లుగా జరిగిన భూముల క్రయవిక్రయాల్లో బహిరంగ మార్కెట్లో ఉన్న రేట్లు, రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూలో ఉన్న రేట్లను పరిశీలిస్తుంది. ప్రైం ఏరియా బీబీనగర్‌లో ఎకరానికి అత్యధికంగా రూ.1.60 కోట్లు ఉండగా, ఇదే మండలం రూరల్ ఏరియాలో రూ.50 లక్షల వరకు ఉంది. భువనగిరిలో హయ్యస్ట్‌గా రూ.1.16 కోట్లుగా ఉంది. చౌటుప్పల్ మండలంలో రూ. 50 లక్షల నుంచి రూ. 88.93 లక్షలుగా ఉంది.
జిల్లాలో ఏ మూలకు వెళ్లినా రూ.20 లక్షలకు తక్కువ లేదు. అయితే కొత్త ప్రాజెక్టుల కోసం ఇప్పుడు సేకరించే భూమి రిజిస్ట్రేషన్ వాల్యూ, బహిరంగ మార్కెట్ విలువను పరిశీలించి ఈ కమిటీలు ధరలను సవరిస్తాయి. ఉన్నతాధికారులకు ఓకే చేశాకే రేట్లు ఖరారు అవుతాయి. కొత్తగా నిర్ణయించిన రేటు ప్రకారం పరిహారం నిర్ణయిస్తారు. అది తక్కువని నిర్వాసితులు భావిస్తే.. కలెక్టర్ నేతృత్వంలోని ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించే అవకాశం ఉంది. పరిహారం నిర్ణయించిన తర్వాత రూరల్ ఏరియాల్లో మూడు రెట్లు, అర్బన్ ఏరియాల్లో రెండు రెట్ల డబ్బులు నిర్వాసితులకు అందుతాయి.
సవరణకు అనామలీస్ కమిటీలు..
ఇటీవలే భూముల విలువలను సవరించినా.. బహిరంగ మార్కెట్‌కు రిజిస్ట్రేషన్ విలువకు తేడా కొనసాగుతూనే ఉంది. అయితే జిల్లాకు కొత్తగా ప్రాజెక్టులు మంజూరు కావడంతో భూముల మార్కెట్ విలువలను పరిశీలించి సవరించేందుకు అనామలీస్ కమిటీలు ఏర్పాటు చేసింది.
అర్బన్ ఏరియాల్లో కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటు చేసే కమిటీలో జిల్లారిజిస్ట్రార్, ఆడిట్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఉంటారు. హెచ్ఎండీఏ పరిధిలో వీరితో పాటు మరో ఆఫీసర్ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) చైర్మన్‌గా ఏర్పాటు చేసే కమిటీలో సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్, ఎంపీడీవోలు సభ్యులుగా ఉంటారు.
