ఒక కల కోసం: ఆలోచింపజేసే ఆణిముత్యాలు.. చిన్నారి పద్మ భవ్యశ్రీ కవిత్యం ఇదే..!

ఒక కల కోసం:  ఆలోచింపజేసే ఆణిముత్యాలు.. చిన్నారి పద్మ భవ్యశ్రీ కవిత్యం ఇదే..!

‘పిట్ట కొంచెం కూతఘనం’ అన్న సామెతను నిజం చేస్తూ తనలో ఉన్న సృజనను మెరుగుపరుచుకుంటూ ప్రశ్నించే తత్వమును అలవర్చుకున్న పి. భవ్యశ్రీ ఆరో తరగతి నుండి తన కలం ద్వారా రచనలు కొనసాగిస్తున్నందుకు అభినందనల సుమమాలలు

నాన్న నడక నేర్పినట్టు, అమ్మ మాటలు నేర్పినట్టు, భవ్యశ్రీకి ఆదరించే చక్కటి గురువు దొరికారు అనడం అతిశయోక్తి కాదు. తెలుగు భాషా బోధకులు శ్రీ నరేష్ చారి గురువుగా చేసిన సూచనలతో కథలు గేయాలు కవితలు రాయడంలో రాటు తేలింది. తను రాసిన సుమారు 70 కవితలతో ‘ఒక కల కోసం’ అనే శీర్షికతో పుస్తకాన్ని తీసుకురావడం గొప్ప విషయం. చిన్నారులను ప్రోత్సహిస్తున్న పాఠశాల భాషోపాధ్యాయుల అక్షర సేద్యం వెలకట్టలేనిది. ఈ సందర్భంగా వారు ప్రశంసనీయలే.

జీవిత సత్యాలు, కవి, చెట్టు, అనాధలు కష్టసుఖాలు, మామ, ఒక కల కోసం, మనం బతకాలంటే మొదలగు శీర్షికలతో అందరి ఎదలలో అమూల్యమైన స్థానం భవ్య శ్రీ సంపాదించడం విద్యార్థుల లోకానికి ఎంతో స్ఫూర్తిదాయకం. 

సెల్​ఫోన్​తో కాలక్షేపం చేస్తున్న నేటి కాలంలో ఆబాల గోపాలన్ని ఆలోచింపజేసే విధంగా ఆణిముత్యాల లాంటి కవితలను అందించిన భవ్యశ్రీ రంగంపేట తొలి బాల కవయిత్రిగా పేరు పొందడం తల్లిదండ్రులకు, పాఠశాలకు ప్రేరణ ఇచ్చిన తెలుగు ఉపాధ్యాయులకు ఎంతో గర్వకారణం. ఎంతో పరిణితి చెందిన రచయితగా, అనుభవ శీలిగా భవ్యశ్రీ కవితలు తప్పకుండా చదవాల్సిందే.

‘‘బ్యాగు వేసుకుని బడికి వెళ్లాల్సింది 
కత్తి పట్టుకొని కారాగారం లోకి వెళ్తున్నాడు.
పాఠశాలకు వెళ్లి పాఠాలు వినాల్సింది 
దొంగతనం చేసి జైలుకెళ్తున్నాడు’’
అనుచు బంగారు బాల్యం ఆవిరైపోతోందంటూ .... ‘‘కొంతమంది’’

 అనే కవిత శీర్షికతో వాస్తవాలను తెలియజెప్పే ప్రయత్నం చేసింది బాల కవయిత్రి భవ్యశ్రీ .

మరో కవితా శీర్షిక ‘‘డబ్బు పిచ్చి’’ లో 
‘‘డబ్బు పిచ్చి ఇప్పుడు జబ్బయింది..
ఏ మానవత్వం మందును రుచి చూపించిన తగ్గనంటుంది..
ఏ ప్రేమ పాఠాన్ని విదిల్చినా లొంగనంటుంది”

అని తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పింది భవ్య శ్రీ. ‘‘అంతేకాకుండా మనిషిపై డబ్బు పైచేయి సాధిస్తునంతసేపు మనిషి సుఖంగా ఉండడు’’.. అని మనుషులందరికీ పట్టిన డబ్బు జబ్బును చక్కటి పదాలతో కవితగా కూర్చడం కొసమెరుపు.

‘‘మా తరగతి గది’’ కవితా శీర్షికలో తరగతి గదిలోని విద్యార్థులను వికసించిన మొగ్గల మాదిరిగా,
 తరగతి గదిని వికసించిన కుసుమంలాగా విజ్ఞాన పరిమళ పూలతోటతో పోల్చడం అలంకారాలపై  బాల రచయిత్రికున్న పట్టు వ్యక్తం అవుతుంది.

‘‘మా పాఠశాల గురువులు పాలించే రాజ్యమైతే, 
అందులోనే మా తరగతి గది చిన్న గ్రామం 
అందులో మా అల్లరి  మాకే మా సంతోషం మాకే..’’ 

మరో కవిత ‘ఒక కల కోసం’లో మారిన సమాజాన్ని నాడు, నేడుగా చక్కగా విశ్లేషించిన తీరుతెన్నులు బాగున్నాయి. 

‘‘అప్పుడు సూర్యుడు నిద్ర లేవక ముందే 
ఇంట్లో పొయ్యిలు నిద్రలేచేవి,
వాకిట్లో ముగ్గులు అప్పుడే విచ్చుకున్న మొగ్గల్ల ..
ఎంతో అందంగా ఉండేది కానీ, 
ఇప్పుడు సూర్యుడు నిద్రలేచినంక కూడా ..
పొయ్యిలు నిద్ర లేవడం లేదు..’’ 
ఇందులోమనీ కంటే ..
మనిషికి మంచి రోజులు రావాలని.


 కవయిత్రి బలంగా కోరుకున్నది.

 మరో అద్భుతమైన విశ్లేషణతో కూడిన కవిత శీర్షిక

 ‘‘మా ఇండ్లు’’లో మా ఇంటి గోడలు 
మీ ఇళ్ల మాదిరిగా సిమెంటుతో 
కట్టినయి కాకపోవచ్చు కానీ..
ఎదుటివారి ఎదను అర్థం చేసుకునే 
మట్టి మనస్సుల ఇండ్లు మావి..

 అని తమ ఇండ్లను సింగిడిలుగా పేర్కొన్నది. బాల కవయిత్రి భవ్యశ్రీ రాసిన ప్రతి కవితను చదువుతుంటే మనసు ఎంతో ఉల్లాసంగా వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది .‘‘విద్యార్థులు’’ అనే మనో శీర్షికలో విద్యార్థులు అనేవారు సమస్యల చీకట్లను తరిమే భాస్కర్లుగా తెలియజెప్పింది .

ఇందులో ఉన్న 70 కవితలలో ఏదో ఒక చక్కటి నైతిక విలువను వాస్తవాలను తెలియజేసే అంశాలను చిన్నారి బాల చిచ్చరపిడుగు భవ్య శ్రీ పాఠకులకు  చేరవేసింది అంటే అతిశయోక్తి కాదు. ఈ పుస్తక ముఖ చిత్రం అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడింది. ఈ పుస్తకంలోని మొత్తం పేజీల సంఖ్య 86. పుస్తకం ధర 150 రూపాయలు.

ఇలాంటి కవితా సంకలనాలు మరెన్నో భవ్యశ్రీ కలం నుండి జాలువారాలని కోరుకుంటూ... మొదటి సంకలనాన్ని సాహిత్య లోకమంతా ఆదరించి ఆశీర్వదించాలని, భవ్యశ్రీ కి అభినందనలు, ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేద్దాం.

- యాడవరం చంద్రకాంత్ గౌడ్​ -