కళా వైభవం: బంగారు తీగల్లో తరతరాల కళ.. నారాయణ్ పేట నగ!

కళా వైభవం: బంగారు తీగల్లో తరతరాల కళ..  నారాయణ్ పేట నగ!

బంగారాన్ని కరిగిస్తే నగ అవుతుంది.. కానీ ఆ బంగారానికే కళారూపం ఇస్తే అది నారాయణ్​పేట నగ అవుతుంది. నేతన్నలు నూలుపోగులతో చీరలను అల్లినట్టే.. ఇక్కడి స్వర్ణకారులు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని అతి సన్నని తీగలుగా మార్చి.. చేతులతోనే అద్భుతమైన ఆభరణాలను అల్లుతున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ కళా నైపుణ్యంతో నారాయణపేట సరాఫ్ బజార్‌‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 

నారాయణపేట.. చేనేత చీరలకే కాదు.. బంగారు నగలకూ ప్రత్యేకమైన చిరునామా. ఇక్కడి సరాఫ్ బజార్‌‌లో తరతరాలుగా కొనసాగుతున్న స్వర్ణకారుల కళ ఇప్పటికీ యంత్రాల పోటీకి ఎదురొడ్డి నిలుస్తోంది. 

రోజురోజుకూ బంగారం ధరలు పెరుగుతున్నా అత్యంత పురాతనమైన బంగారం మార్కెట్ అయిన నారాయణపేట సరాఫ్ బజార్ మాత్రం కళకళలాడుతూనే ఉంది. ఇది ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ఉంది. తెలంగాణ రాష్ట్రంతోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా బంగారం కొనేందుకు సరాఫ్ బజార్​ను వెతుక్కుంటూ వస్తున్నారంటే ఇక్కడి బంగారు ఆభరణాలకు ఉన్న ప్రత్యేకత ఏమిటో అర్థమవుతోంది.

150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బంగారం మార్కెట్లో నారాయణపేట స్వర్ణకారులు 24 క్యారెట్ల బంగారంతో సన్నని దారాలు తీసి చేత్తోనే వివిధ రకాల ఆభరణాలను తయారుచేస్తున్నారు. బంగారం స్వచ్ఛతతోపాటు పురాతన మోడళ్లలో వివిధ రకాల ఆభరణాలు లభిస్తుండటంతో ఇక్కడి బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. 

పెళ్లిళ్ల సీజన్​తోపాటు, పండుగల సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, కర్ణాటకలోని రాయచూర్, బీదర్, గుల్బర్గా, సేడం, యాద్దీర్, మహారాష్ట్రలోని షోలాపూర్, పూణే ప్రాంతాల నుంచి ప్రజలు బంగారం కొనేందుకు నారాయణపేట సరాఫ్ బజార్​కు తరలివస్తుండటంతో కళకళలాడుతుంది. 

ఏటా వేయి కోట్ల రూపాయల బంగారం విక్రయాలు సాగుతున్నాయని నారాయణపేట సరాఫ్ బజార్​కు చెందిన బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినారాయణ్ భట్టాడ్ చెప్పారు.

సరాఫ్ బజార్‌‌.. స్వచ్ఛమైన బంగారం.. 

స్వచ్ఛమైన బంగారం.. నాణ్యమైన తయారీ.. చేతి పనితనం.. ఇవన్నీ కలవడంతో నారాయణపేట్ నగలకు ప్రత్యేక మార్కెట్ ఏర్పడింది. ముఖ్యంగా మంచి నాణ్యత కారణంగా రీసేల్‌‌ విలువ కూడా మెరుగ్గా ఉంటుందని వ్యాపారులు చెప్తున్నారు. దీంతో సరాఫ్ బజార్‌‌కు బులియన్ మార్కెట్‌‌లో ప్రత్యేక పేరొచ్చింది.

 దేశంలో ఏ మూల బంగారు నగల కొత్త డిజైన్ వచ్చిందంటే చాలు అది ఇక్కడికి రాగానే దాన్ని నారాయణపేట స్వర్ణకారులు తయారుచేస్తుంటారు. గోపుతాళ్లు, బాజుబంద్‌‌లు, పాట్లీలు, చిలుక పాట్లీలు, లంబాడా ముక్కుపుడకలు వంటి సంప్రదాయ డిజైన్లకు డిమాండ్ ఎక్కువ.

చేనేత శైలిలో బంగారు తీగలతో నగలను తయారుచేయడం సరాఫ్ బజార్ స్వర్ణకారుల ప్రత్యేకత. వీరు తయారుచేస్తున్న బంగారు ఆభరణాలను మగువలు ఇష్టపడుతుంటారు.150 ఏళ్ల చరిత్ర ఉన్న నారాయణపేట స్వర్ణభరణాలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వాలని కోరుతూ తాము దరఖాస్తు చేశామని, ఈ దరఖాస్తు పరిశీలనలో ఉందని నారాయణపేట 24 క్యారట్ గోల్డ్ జీఐ దరఖాస్తుదారుడు, చీఫ్ కో– ఆర్డినేటర్ సాకేత్ భట్టాడ్ చెప్పారు. త్వరలో తమ స్వర్ణకారులు చేత్తో తయారుచేస్తున్న బంగారు ఆభరణాలకు జీఐ ట్యాగ్ వస్తుందని సాకేత్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాలం మారింది.. డిజైన్లు మారాయి.. యంత్రాల ఉపయోగం పెరిగింది. కానీ నారాయణపేట స్వర్ణకారుల చేతివృత్తి మాత్రం తన ప్రత్యేకతను కోల్పోలేదు. నారాయణపేట నగ అంటే.. బంగారం మాత్రమే కాదు.. ఓ అద్భుతమైన కళా వారసత్వం!

 నారాయణపేట్ స్వర్ణకారుల కళ భళా

నేతన్నలు నూలు పోగులతో చీరలను అల్లినట్లుగా ఇక్కడి కళాకారులు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని అతి సన్నని తీగలుగా మార్చి అందమైన ఆభరణాలుగా అల్లుతారు. ఇక్కడి మహిళా స్వర్ణకారులు గోపు జడతాళ్లను తయారుచేస్తున్నారు. 

వివిధ డిజైన్లలో గాజులు, చిలుక పాట్లీలు, తాళి బొట్టు, టుస్సీ, మాటీలు లాంటి సంప్రదాయ ఆభరణాల తయారీ ఇక్కడి సరాఫ్ బజార్ స్వర్ణకారుల ప్రత్యేకత. నారాయణపేట్లో ఉన్న 300 మంది స్వర్ణకారులు యంత్రాలపై కాకుండా తమకున్న కళానైపుణ్యంతో చేత్తోనే బంగారు ఆభరణాలను తయారుచేస్తున్నారు. నిజాం రాజులు కూడా నారాయణపేట్ స్వర్ణకారులతో నగలు తయారుచేయించుకున్నారని చరిత్రకారులు చెప్తుంటారు.