కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: జైనూర్ మండలంలోని పట్నపూర్ గ్రామంలో పత్తి పంటలో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి తోటలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 1,245 గంజాయి మొక్కలతో పాటు 15 గ్రాముల ఎండు గంజాయిని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.25 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పత్తి వంటి సాధారణ పంటల మధ్య అంతర పంటగా గంజాయి సాగు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
►ALSO READ | ముత్యం ధారకు వెళ్లిన హైదరాబాద్ పర్యాటకులకు రూ.10 వేల జరిమానా
గంజాయి సాగుకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు, జిల్లాలో గంజాయి సాగు మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసుల చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
