తెలంగాణ వ్యాప్తంగా దంచికొట్టిన వాన .. సీజన్లో తొలిసారి అత్యధిక వర్షపాతం

తెలంగాణ వ్యాప్తంగా దంచికొట్టిన వాన ..  సీజన్లో తొలిసారి అత్యధిక వర్షపాతం
  • వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి, జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
  • మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 20.5 సెంటీమీటర్లు నమోదు
  • వరంగల్ రాయపర్తిలో 14.6, యాదాద్రి జిల్లా దత్తప్పగూడలో 14.2 సెంటీమీటర్లు
  • సీజన్‌‌‌‌లో తొలిసారి రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదు
  • మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

హైదరాబాద్, వెలుగు: నెల రోజులుగా కరువు పరిస్థితులు తాండవిస్తున్న వేళ.. వరుణ దేవుడు రాష్ట్రంపై కరుణ చూపాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వానలు కురిశాయి. శనివారం రాత్రి మొదలైన వర్షాలు.. ఆదివారం కూడా కొనసాగాయి. ముఖ్యంగా కరువు పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్న వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాలను వర్షం ముంచెత్తింది. రాష్ట్రంలో ఈ సీజన్‌‌‌‌లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. 

జులైలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో చెప్పుకోదగిన స్థాయిలోనే వర్షాలు పడినా.. 12 నుంచి 13 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదు కాలేదు. కానీ, శనివారం అల్పపీడనం ప్రభావంతో దానికి మించిన వర్షాలు పడ్డాయి. మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవగా, కుమ్రంభీం ఆసిఫాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి.

ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నిర్మల్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. 

ఈ సీజన్‌‌‌‌లో ఫస్ట్ టైం 20 సెంటీమీటర్లు..

రాష్ట్రంలో ఈ సీజన్‌‌‌‌లోనే తొలిసారిగా వర్షపాతం 20 సెంటీమీటర్ల మార్క్‌‌‌‌ను దాటింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో అత్యధికంగా 20.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా నెల్లికుదురులో 15.6 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 14.9, వరంగల్ జిల్లా రాయపర్తిలో 14.6, యాదాద్రి భువనగిరి జిల్లా దత్తప్పగూడలో 14.2, మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచలో 14, వడ్డెకొత్తపల్లిలో 13, యాదాద్రి జిల్లా రామన్నపేటలో 12.8, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 12.6, జనగామ జిల్లా కొడకండ్లలో 12.6, నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 12.6, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 12, మునిగలవీడులో 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 11.8, జనగామ జిల్లా దేవరుప్పలలో 11.5, సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిలో 11.2, యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో 11.1, మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో 11, నర్సింహులపేటలో 10.8, వరంగల్ జిల్లా కల్లెడలో 10.5, సూర్యాపేట జిల్లా నాగారంలో 10.1, యాదాద్రి జిల్లా వలిగొండలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ సిటీలోనూ రాత్రంగా ముసురు పట్టింది. అత్యధికంగా బాచుపల్లిలో 4.6 సెంటీమీటర్ల వర్షం పడింది. ఆర్సీపురంలో 4.3, పటాన్‌‌‌‌చెరులో 4.1, మియాపూర్‌‌‌‌‌‌‌‌లో 3.5, ఘన్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో 3.4, మేడ్చల్‌‌‌‌లో 3.2, బంజారాహిల్స్‌‌‌‌లో 3, కొంగర్ కలాన్‌‌‌‌లో 2.9, దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో 2.8, షేక్‌‌‌‌​పేటలో 2.8, గచ్చిబౌలిలో 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

పొంగిపొర్లిన వాగులు, చెరువులు..

శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు నుంచి కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలోని వాగులు, చెరువులు పొంగిపోర్లాయి. ఆకేరు, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులపై నిర్మించిన చెక్ డ్యామ్‌‌‌‌లు నిండి మత్తడి పోస్తున్నాయి. జిల్లాలోని బయ్యారం పెద్ద చెరువు మత్తడి పోస్తున్నది. చెరువుల్లోకి క్రమంగా నీరు చేరుకోవడం, ప్రధాన వాగులు జలంతో  పొంగడంతో పంటలకు జీవం పోసినట్లైంది. జిల్లాలోని మడిపల్లి గ్రామ సమీపంలో అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. 

రావిరాల గ్రామ సమీపంలో వాగు ప్రవహించడంతో తొర్రూర్ నుంచి మహబూబాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ముప్పారం గ్రామ సమీపంలోనూ పాలేరు వాగు రోడ్డుపై ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తొర్రూరు మండలం గోపాలగిరి సమీపంలో పంట పొలాలు నీటిలో మునిగాయి. జిల్లాలోని నెల్లికుదురు నుంచి తొర్రూర్ వెళ్లే నేషనల్‌‌‌‌ హైవే విస్తరణ పనులకు ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు వరద తీవ్రతకు కొట్టుకపోయింది. దంతాలపల్లి, పెద్దముప్పారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నరసింహుల పేట మండలంలోని కౌసల్య దేవిపల్లి, జయపురంలో వరదనీటి ప్రభావం పెరిగింది. 

రెండో రోజు నిలిచిన బొగ్గు ఉత్పత్తి..

మూడు రోజులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కేటీకే 2, 3 ఓసీల్లోకి వర్షపు నీరు చేరుతోంది. ఓవర్ బర్డన్ తొలగింపునకు వరద నీరు ఆటంకంగా మారడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీకే 2, 3 ఓసీల్లో కలిపి 10 వేల టన్నుల ఉత్పత్తి నిలిచింది. రెండ్రోజులుగా మూడు షిప్టుల్లో చేపట్టే పనులు నిలవడంతో కార్మికులు, యంత్రాలు డంపింగ్ యార్డుకే పరిమితమయ్యాయి. రెండ్రోజుల్లో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా, సింగరేణి సంస్థకు రూ.80 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. 

మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు..

మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనంతో డైరెక్ట్ ప్రభావం లేకపోయినా పలు జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు పడతాయంది. కొన్ని చోట్ల భారీ వర్షాలూ పడొచ్చని చెప్పింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీ, తూర్పు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌‌‌‌ను జారీ చేసింది. ఆ తర్వాత నుంచి అల్పపీడన ప్రభావం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని, ఉక్కపోత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.