ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి ..బీసీ నేతల డిమాండ్

ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి ..బీసీ నేతల డిమాండ్
  • బీసీ కులగణనపై బీజేపీ మాట తప్పిందని ఫైర్
  • కేంద్రాన్ని నిలదీయాలని రాహుల్‌‌‌‌కు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: అణగారిన వర్గాల (ఓబీసీ)లోని ప్రతి కులానికి ప్రత్యేకమైన యూనిక్‌‌‌‌ కోడ్‌‌‌‌ కేటాయించిన తర్వాతే జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఓబీసీ నేతలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణనను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలన్నారు. బీసీల జనాభా ఆధారంగానే వారికి విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు మార్గం సుగమమవుతుందని స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలోని జవహర్‌‌‌‌ భవన్‌‌‌‌లో ఓబీసీ జాతీయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్‌‌‌‌ ఓబీసీ చైర్మన్‌‌‌‌ అనిల్‌‌‌‌ జైహింద్‌‌‌‌, సూరజ్‌‌‌‌ మండల్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేత శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌, ఇతర నేతలు పాల్గొన్నారు.  ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జనగణనలో ప్రత్యేక బీసీ కాలమ్‌‌‌‌ ఏర్పాటు చేసి, శాస్త్రీయమైన కోడ్‌‌‌‌ వ్యవస్థను అమలు చేస్తేనే కచ్చితమైన జనాభా లెక్కలు సాధ్యమవుతాయన్నారు. లేకపోతే బీసీ కులగణన పేరుతో బీసీలను మోసం చేసినట్లవుతుందన్నారు. కాంగ్రెస్‌‌‌‌ నేత రాహుల్‌‌‌‌ ప్రకటించిన “జిత్నీ ఆబాదీ ఉత్నా హిస్సా” (ఎంత జనాభా ఉంటే అంత వాటా) నినాదం అమలు కావాలంటే ముందుగా దేశంలో బీసీల జనాభా ఎంతుందో కచ్చితంగా తేలాల్సిందేనన్నారు.  దీనిపై కేంద్రాన్ని నిలదీయాలని  రాహుల్​ గాంధీకి విజ్ఞప్తి చేశారు. 

జంతర్‌‌‌‌ మంతర్‌‌‌‌ ఆందోళనకు మద్దతివ్వాలి..

ఓబీసీ కులాల సమగ్ర జాబితాను రూపొందించాలని నేతలు డిమాండ్ చేశారు. ఒకే కులం.. ఒక రాష్ట్రంలో ఓసీగా, మరో రాష్ట్రంలో బీసీగా, ఇంకో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీగా ఉండే పరిస్థితులున్నందున రాష్ట్రాలవారీ వర్గీకరణను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జంతర్‌‌‌‌మంతర్‌‌‌‌ వద్ద జరిగే ఆందోళనలకు కాంగ్రెస్ ఎంపీలు మద్దతుగా నిలవాలన్నారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు న్యాయం జరగాలన్నా.. విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో వాటా దక్కాలన్నా సమగ్ర కులగణన తప్పనిసరి అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా బీసీలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.