కోల్‌కతా: టీఎంసీ రెబల్ నేత, ఎంపీ జగదీష్ చంద్ర బర్మ బసునియా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI )కి చెందిన ఇరవై మంది ఎంపీలలో పదిహేడు మంది దుర్గా పూజకు ముందు లేదా ఆ తర్వాత బీజేపీలో చేరతారంటూ బిగ్ బాంబ్ పేల్చారు. కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు ఇప్పటికే లైన్ క్లియర్ చేసుకున్నామని చెప్పారు. 20 మంది సభ్యులలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది పార్టీ మారనున్నందున మాకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని తెలిపారు. మిగిలిన ముగ్గురు ఎంపీలు అబు తాహెర్ ఖాన్, ఖలీలుర్ రెహమాన్, యూసుఫ్ పఠాన్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తారని పేర్కొన్నారు.
అంతా మీ ఇష్టం కాదు:
17 మంది ఎన్సీపీఐ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారంటూ టీఎంసీ రెబల్ నేత జగదీష్ చంద్ర బర్మ బసునియా చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. ఈ క్రమంలో బసునియా కామెంట్స్‌ను బెంగాల్ బీజేపీ యూనిట్ ఖండించింది. బెంగాల్ బీజేపీ చీఫ్ సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. ఎన్సీపీఐ ఎంపీల చేరిక గురించి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వాళ్లు కోరుకున్నంత మాత్రాన పార్టీలో చేరడానికి బీజేపీ అనుమతించదని స్పష్టం చేశారు.
టీఎంసీ పాలనలో ఈ నాయకులు, ఎంపీలు చేసిన అఘాయిత్యాలను రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.
టీఎంసీ నుంచి ఎన్‌సీపీఐలోకి 20 మంది ఎంపీలు:
2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. దశాబ్ధాల చరిత్రను తిరగరాస్తూ బెంగాల్ గడ్డపై తొలిసారి బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 20 మంది టీఎంసీ ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పెద్దగా ఎవరికీ తెలియని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI )లో చేరి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌కు మద్దతు ప్రకటించారు.
►ALSO READ | అప్పు కోసం పాక్ కొత్త డ్రామా.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్‌పై రివార్డ్ పెంపు
ఈ తిరుగుబాటును బీజేపీయే నడిపించిందని మమతా బెనర్జీ ఆరోపించారు. పార్టీ ఫిరాయింపు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ టీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 20 మంది తిరుగుబాటు ఎంపీలకు నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ తరుణంలో వీరు అధికార బీజేపీలో చేరబోతున్నారంటూ ఎంపీ బసునియా చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి.
