వీడియో వైరల్‌ : మహిళా బైకర్‌ను వెంటాడి మరీ కారుతో ఢీకొట్టి పరార్

వీడియో వైరల్‌ : మహిళా బైకర్‌ను వెంటాడి మరీ కారుతో  ఢీకొట్టి పరార్

గురుగ్రామ్‌లో ఓ మహిళా బైకర్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన ఘటన కలకలం రేపుతోంది. గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు యాక్షన్ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదం అనంతరం కారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పోలీసులు హిట్ అండ్ రన్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనలో గాయపడిన మహిళను సియా (Sia)గా గుర్తించారు. ఆదివారం సియా తన తోటి బైకర్లతో కలిసి రైడ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. 

సియా తెలిపిన వివరాల ప్రకారం.. వైట్ కలర్  సెడాన్‌లో ఉన్న వ్యక్తులు  నన్ను ఫాలో అవుతున్నారు.. కారు డ్రైవర్‌ ప్రమాదకరంగా వాహనం నడుపుతున్నాడు . నా   బైక్ కు  కారు  దూరం పాటించాలని  కోరినా వినకుండా నా  బైక్ ను  పక్కకు ఆపమని చెప్పాడు.  కారులో ఉన్నవారు మద్యం సేవించి ఉన్నట్లు నాకు  అనిపించింది . అయితే, కారులో ఎంతమంది ఉన్నారన్నది నాకు తెలియదు. అయితే ఒక్కసారిగా కారు పక్కకు మళ్లి నా  బైక్‌ను ఢీకొట్టడంతో  రోడ్డుపై పడిపోయాను.   బైక్‌ 100 మీటర్ల వరకు రోడ్డుపై స్కిడ్ అయింది అని తెలిపారు 

మరో బైకర్ కెమెరాలోనూ ఘటన

సియాతో పాటు ప్రయాణిస్తున్న మరో బైకర్‌ హెల్మెట్‌కు అమర్చిన కెమెరాలో ఈ ఘటన తర్వాతి దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. అతడు కారును వెంబడించి, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆగిన సమయంలో డ్రైవర్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు. అయితే  కొద్దిసేపటికే కారు  అక్కడి నుంచి  వెళ్లిపోయింది. ప్రమాదంలో గాయపడిన సియాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై  కారు యజమాని స్పందించారు. తాను భారత సైన్యంలో పనిచేస్తున్నానని, ప్రస్తుతం నగరంలో లేనని ఆయన తెలిపారు. తన స్కూల్‌ స్నేహితుడు రెండు రోజుల కోసం తన కారును తీసుకెళ్లినట్లు చెప్పారు. 

సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో గురుగ్రామ్ పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. పోలీసులే స్వయంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కారు నడిపిన వ్యక్తిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే గాయపడిన సియా నుంచి పూర్తి వివరాలు సేకరించేందుకు ఆమెను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే బైక్‌ను ఢీకొట్టినట్లు కనిపిస్తోందని పలువురు పేర్కొంటూ, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.