గోవా కోర్టులో లొంగిపోయిన తెహల్కా మాజీ ఎడిటర్.. కోల్వాలే జైలుకు తరలింపు

గోవా కోర్టులో లొంగిపోయిన తెహల్కా మాజీ ఎడిటర్.. కోల్వాలే జైలుకు తరలింపు

పనాజీ: సహోద్యోగినిపై లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గోవాలోని మపుసా కోర్టులో లొంగిపోయారు. అనంతరం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా పోలీసులు ఆయనను  కోల్వాలే జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థపై తనకు సంపూర్ణ నమ్మకం ఉందని.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. 

కేసు ఏంటంటే..?

ప్రముఖ న్యూస్ మ్యాగజైన్ తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ సింగ్‎పై 2013లో రేప్ కేసు నమోదు అయ్యింది. తేజ్‎పాల్ తనపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపిస్తూ ఆయన దగ్గర పనిచేసిన ఓ మహిళా జర్నలిస్టు పోలీసులను ఆశ్రయించింది. థింక్ ఫెస్ట్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో.. హోటల్ ఎలివేటర్ లోపల తనపై దాడి చేసినట్లు ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

2017లో గోవాలోని మపుసా ట్రయల్ కోర్టులో ఈ కేసు విచారణ మొదలైంది. నాలుగేండ్ల విచారణ అనంతరం 2021లో కోర్టు అతడిని నిర్దోషిగా తేల్చింది. ట్రయల్ కోర్టు తీర్పును గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టు గోవా బెంచ్‎లో సవాల్ చేసింది. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు 2026, ఆగస్టు 6న సంచలన తీర్పు వెలువరించింది.

►ALSO READ | వీడియో వైరల్‌ : మహిళా బైకర్‌ను వెంటాడి మరీ కారుతో ఢీకొట్టి పరార్

 తేజ్‎పాల్‎ను దోషి తేలుస్తూ పదేండ్ల జైలు శిక్ష విధించింది. నెల రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో బాంబే హైకోర్టు తీర్పును తేజ్‎పాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బాంబే హైకోర్టు తీర్పును రద్దు చేయాలని ఆయన కోరారు. లొంగుబాటు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. 

అయితే, అప్పీల్‌ను విచారించాలంటే మూడు వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీం కోర్టు తేజ్‎పాల్‎ను ఆదేశించింది. అనంతరం 2026, సెప్టెంబర్ 22వ తేదీకి కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోమవారం (సెప్టెంబర్ 14) తేజ్‎పాల్ కోర్టులో సరెండర్ అయ్యారు.