బిగ్‌బాస్ తెలుగు 10: నామినేషన్ టాస్క్‌లో ట్విస్ట్.. సేఫ్ అయిన ఆ నలుగురు వీళ్లే!

బిగ్‌బాస్ తెలుగు 10: నామినేషన్ టాస్క్‌లో ట్విస్ట్.. సేఫ్ అయిన ఆ నలుగురు వీళ్లే!

బిగ్‌బాస్ పేరు వినగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఒక్కటే.. నామినేషన్స్. హౌస్ లో అసలు ఆట మొదలయ్యేది ఇక్కడి నుంచే. కంటెస్టెంట్ల మధ్య దాగి ఉన్న అభిప్రాయాలు బయటపడటం, చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారడం, ఒక్కోసారి ఫ్రెండ్‌షిప్‌లు కూడా బీటలు వారడం.. ఇవన్నీ నామినేషన్ డేలోనే కనిపిస్తాయి. ఇక బిగ్‌బాస్ తెలుగు సీజన్10లోనూ తొలిసారి ఈ నామినేషన్ల సెగ మొదలైంది.

మొదటి వారం సాధారణ నామినేషన్ ప్రక్రియ లేకపోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. 'మహాపరీక్ష'లో భాగంగా జరిగిన పోటీల అనంతరం చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్‌లు తొలి వారంలోనే ఎలిమినేట్ కావడం షాకిచ్చింది. ఇక వీకెండ్ ఎపిసోడ్‌తో తొలి దశ ముగిసిందని ఆదివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ప్రకటించారు.. రెండో వారంలో 'పవర్ ఆఫ్ పీపుల్' అనే కొత్త దశ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. నామినేషన్స్ కోసం బిగ్‌బాస్ ఈసారి వినూత్న టాస్క్ పెట్టాడు. భారీ దిమ్మకు చుట్టిన తాడును ఇద్దరు కంటెస్టెంట్లు ఒకేసారి విప్పాలి. ఎవరు ముందుగా తాడును పూర్తిగా తొలగిస్తారో వారికి నామినేషన్ చేసే అధికారం దక్కుతుంది. ఈ అవకాశాన్ని అందుకున్న సుధీర్.. ఏకంగా త్రిగుణ్‌ను టార్గెట్ చేశాడు. చైత్ర విషయంలో ముందుగానే ఆమె పేరును చెప్పడం తనకు నచ్చలేదని కారణం చెప్పాడు. అనంతరం వాష్‌రూమ్ క్లీన్ చేసే బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదంటూ షాలినిని నామినేట్ చేశాడు.

►ALSO READ | 'రామాయణ' మ్యాజికల్ మెలోడీ 'జై జై రామ్' రిలీజ్.. రెహమాన్-అరిజిత్-శ్రేయా ఘోషాల్ మ్యాజిక్.!

మరోవైపు దేబ్జానీ కూడా త్రిగుణ్‌నే నామినేట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్ సైతం త్రిగుణ్‌తో పాటు ఝాన్సీని నామినేట్ చేశాడు. ఆమె సేఫ్ గేమ్ ఆడుతోందని, డిస్కషన్లలో పెద్దగా కనిపించడం లేదని ఆరోపించాడు. దీంతో రోహిత్, ఝాన్సీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రస్తుతం ఇంట్లో 14 మంది కంటెస్టెంట్లు ఉండగా.. ఈ వారం ఏకంగా 10 మంది నామినేషన్‌లో ఉన్నట్లు సమాచారం. షాలిని, త్రిగుణ్, ఝాన్సీ, కృష్ణుడు, రాంప్రసాద్, వర్షిణి, సుధీర్, రోహిత్, ముకేశ్, దేబ్జానీ ఎలిమినేషన్ రేసులో ఉన్నారు. సృష్టి, వంశీ, నరేశ్, అమన్ మాత్రం సేఫ్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక తొలి వారంలోనే రెండు ఎలిమినేషన్లతో షాక్ ఇచ్చిన బిగ్‌బాస్.. రెండో వారంలో ఎవరికి గుడ్‌బై చెబుతాడో అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. 10 మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఈ వారం హౌస్‌లో గేమ్ మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.