భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం 'రామాయణ'. దర్శకడు నితేష్ తివారీ దార్శనికతలో.. నమిత్ మల్హోత్రా -రాకింగ్ స్టార్ యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఎపిక్ మూవీ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఏకంగా 100 కోట్ల డిజిటల్ వ్యూస్ సాధించి ఆల్‌టైమ్ రికార్డులను గుల్ల చేసింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు...
'జై జై రామ్' సాంగ్ రిలీజ్..
అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ ఎపిక్ డ్రామా ప్రమోషన్ల పర్వంలోకి అడుగుపెట్టింది. వినాయక చవితి శుభసందర్భంగా మేకర్స్ శ్రీరాముడు, సీతాదేవిల ప్రత్యేకమైన మొదటి పోస్టర్ విడుదల చేశారు. అంతేకాకుండా 'జై జై రామ్' అనే మొదటి భక్తిరస పూరిత గీతాన్ని విడుదల చేసి ప్రమోషన్ల పర్వంలో మరో సంచలనానికి తెరలేపింది. ప్రస్తుతం ఈ సాంగ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
మ్యూజికల్ మ్యాజిక్..
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ దైవిక గీతానికి ప్రముఖ కవి డాక్టర్ కుమార్ విశ్వాస్ సాహిత్యం అందించగా, ఇండియాస్ టాప్ సింగర్స్ అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషాల్ తమ అమృత గాత్రంతో ప్రాణం పోశారు. ఏఆర్ అమీన్, హీరాల్ విరాడియా మ్యూజిక్ సూపర్ విజన్ అందించిన ఈ పాట, ఒకవైపు ఆధ్యాత్మిక ఆర్తిని, మరోవైపు అంతర్జాతీయ స్థాయి సినిమాటిక్ సౌండ్‌ను ఒకేసారి అనుభూతి చెందేలా చేస్తోంది.
శ్రీరాముడి దివ్యత్వాన్ని, ధర్మాన్ని చాటిచెప్పేలా ఉన్న ఈ పాట ప్రతీ శ్రోత హృదయాన్ని తాకుతోంది. హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ (Hans Zimmer) ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటం విశేషం.
వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్!
ఈ విజువల్ వండర్‌లో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో అలరించనున్నారు. లంకేశ్వరుడు రావణాసురుడిగా యశ్ నటిస్తుండగా, సన్నీ డియోల్ (హనుమంతుడు), రవి దూబే (లక్ష్మణుడు), కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఎపిక్ డ్రామా నవంబర్ 6, 2026న IMAXతో సహా పలు అంతర్జాతీయ ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. ఇకపై వరుస అప్‌డేట్‌లతో 'రామాయణ' వరల్డ్ వైడ్ హంగామా సృష్టించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
