Disha Case Update: సుశాంత్ మాజీ మేనేజర్ దిశా మృతి కేసులో సంచలనం.. మాజీ సీఎం కొడుకుపై FIR

Disha Case Update: సుశాంత్ మాజీ మేనేజర్ దిశా మృతి కేసులో సంచలనం.. మాజీ సీఎం కొడుకుపై FIR

బాలీవుడ్‌ను ఏళ్లుగా వెంటాడుతున్న దిశా సాలియన్ (Disha Salian) మృతి కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో తాజాగా సీబీఐ (CBI) FIR నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఈ పరిణామం బాంబే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చోటుచేసుకుంది. దీంతో ఆరేళ్ల క్రితం జరిగిన ఈ మిస్టరీ డెత్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.

అసలేం జరిగింది?

2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఓ నివాస భవనం నుంచి దిశా సాలియన్ కిందపడిపోయి మృతి చెందారు. అప్పట్లో ఈ ఘటనను యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత ఆమె మృతి, ఆరు రోజుల అనంతరం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కావడంతో ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో, మీడియాలో అనేక రకాల వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ రెండు మరణాల మధ్య సంబంధం ఉన్నట్లు నిర్ధారించే అధికారిక ఆధారం బయటకు రాలేదు.

దిశా తండ్రి సతీశ్ సాలియన్ మాత్రం తన కుమార్తె మరణం వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆరోపిస్తూ, కేసును మళ్లీ లోతుగా దర్యాప్తు చేయాలని కోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారనే ఆరోపణలతో పాటు, ఈ కేసులో ప్రభావవంతమైన వ్యక్తుల పాత్రపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఆరోపణలు మాత్రమే.. CBI దర్యాప్తులో అవి నిజమా కాదా తేలాల్సి ఉంది.

బాంబే హైకోర్టు ఎందుకు CBI దర్యాప్తుకు ఆదేశించింది?

2026 సెప్టెంబర్ 2న బాంబే హైకోర్టు ఈ కేసులో కీలక ఆదేశాలు ఇచ్చింది. గతంలో జరిగిన పోలీసుల దర్యాప్తు అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయిందని, కొన్ని అంశాల్లో స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నాయని కోర్టు పేర్కొంది. అందుకే ఈ కేసులో CBI దర్యాప్తు అవసరమని నిర్ణయించింది.

కేసుకు సంబంధించి FIR నమోదు చేయడంతో పాటు, దిశా తండ్రి సతీశ్ సాలియన్ స్టేట్‌మెంట్‌ను నమోదు చేయాలని, సీనియర్ మరియు అనుభవజ్ఞుడైన అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలని CBIని ఆదేశించింది. అదే సమయంలో.. దర్యాప్తులో తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితుడిగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది.

CBI ముందు తండ్రి కీలక స్టేట్‌మెంట్..

హైకోర్టు ఆదేశాల తర్వాత సెప్టెంబర్ 11న దిశా తండ్రి సతీశ్ సాలియన్ CBI అధికారుల ముందు తన స్టేట్‌మెంట్ ఇచ్చారు. తనకు తెలిసిన వివరాలతో పాటు, కేసుతో సంబంధం ఉందని తాను భావిస్తున్న పలువురి పేర్లను అధికారులకు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. మీడియా కథనాల ప్రకారం, ఆయన పేర్కొన్న పేర్లలో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, నటులు రియా చక్రవర్తి, డినో మోరియా, సూరజ్ పంచోలి తదితరులు ఉన్నారు. కొంతమంది బాడీగార్డులు, మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్, మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే సహా పలువురు తన కుమార్తె మరణం వెనుక ఉన్న వాస్తవాలను కప్పిపుచ్చడంలో, అలాగే జరిగినట్లు ఆరోపిస్తున్న కుట్రలో కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నట్లు ఐఏఎన్ఎస్ నివేదించింది.

బాలీవుడ్ ప్రముఖుల పేర్లు.. అసలు క్లారిటీ ఏంటి?

దిశా తండ్రి సతీష్ సాలియన్ చేసిన ఆరోపణలు, ఆయన CBIకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పలువురు ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే వారిపై నేరం రుజువైందని, వారు కేసులో నిందితులని ఇప్పుడే చెప్పడం సరికాదు. ముఖ్యంగా బాంబే హైకోర్టు తన ఆదేశాల్లో ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. దర్యాప్తులో తగిన ఆధారాలు లభిస్తేనే ఎవరినైనా నిందితుడిగా పరిగణించవచ్చని కోర్టు తెలిపింది. కాబట్టి ప్రస్తుతం ఈ పేర్లన్నీ దర్యాప్తు పరిధిలో ప్రస్తావనకు వచ్చిన పేర్లు/ఆరోపణలకు సంబంధించినవి మాత్రమే అని చెప్పాలి.

సూరజ్ పంచోలి ఏమన్నారు?

కేసులో తన పేరు ప్రస్తావనకు రావడంపై నటుడు సూరజ్ పంచోలి ఇప్పటికే స్పందించారు. దిశా సాలియన్‌ను తాను జీవితంలో ఎప్పుడూ కలవలేదని, ఆమెతో ఫోన్‌లో కూడా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. 2021లో CBI, మల్వాణి పోలీసులకు తానే స్వచ్ఛందంగా స్టేట్‌మెంట్ ఇచ్చానని చెప్పారు. తనపై ఎలాంటి ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవచ్చని, కానీ ఆధారాలు లేకుండా తనను ఈ కేసులోకి లాగవద్దని కోరారు.

సుశాంత్ కేసుతో మళ్లీ లింక్ అవుతుందా?

దిశా సాలియన్ మృతి జరిగిన ఆరు రోజులకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెందడం వల్ల అప్పటినుంచే ఈ రెండు ఘటనలు పరస్పరం సంబంధం ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. దిశా తండ్రి తరఫు న్యాయవాది కూడా ఈ రెండు కేసుల మధ్య సంబంధం ఉందని ఆరోపించారు. అయితే ప్రస్తుతం CBI అధికారికంగా దిశా మృతి కేసులో దర్యాప్తు చేస్తోంది. ఈ రెండు ఘటనలకు మధ్య నిజంగా ఏదైనా సంబంధం ఉందా? లేదా? అనేది దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.

►ALSO READ | 'రామాయణ' మ్యాజికల్ మెలోడీ 'జై జై రామ్' రిలీజ్.. రెహమాన్-అరిజిత్-శ్రేయా ఘోషాల్ మ్యాజిక్.!

ఇక CBI ఏం తేల్చనుంది?

ఆరేళ్లుగా వివాదంగా ఉన్న ఈ కేసులో ఇప్పుడు CBI దర్యాప్తు మొదలవడంతో పలు ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా అనే ఆసక్తి నెలకొంది. దిశా మృతి ప్రమాదమా? ఆత్మహత్యా? లేక మరేదైనా జరిగిందా? గత దర్యాప్తులో వెలుగులోకి రాని అంశాలు ఏమైనా ఉన్నాయా? కేసులో ప్రస్తావనకు వచ్చిన ప్రముఖుల పాత్రపై ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అన్న విషయాలను CBI పరిశీలించనుంది. ప్రస్తుతం మాత్రం తుది నిజం ఏంటనేది చెప్పే దశ రాలేదు. CBI దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఆరోపణల్లో ఎంత నిజం ఉంది, ఎవరి పాత్ర ఏంటి, అసలు దిశా సాలియన్ మృతికి కారణం ఏమిటి అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

దేవుడు ఎప్పుడూ ధర్మం వైపే..: రాజ్‌పుత్ సోదరి

సుశాంత్ రాజ్‌పుత్ సోదరి సీబీఐ విచారణను స్వాగతించారు. సీబీఐ దర్యాప్తుపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి కూడా స్పందించారు. సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ, సాలియన్ మరణం చుట్టూ ఉన్న నిజాలను నిరూపితం చేయడానికి ఈ దర్యాప్తు సహాయపడుతుందని శ్వేత ఆశాభావం వ్యక్తం చేశారు. దేవుడు ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాడని, సత్యం ఎప్పటికీ ఓడిపోదని సతీష్ సాలియన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.