డ్యూటీలో నిర్లక్ష్యం ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. బ్రిక్స్ సదస్సులో డ్యూటీ చేస్తున్న ఢిల్లీకి చెందిన ఓ కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కఠిన చర్యలు చేపట్టారు ఢిల్లీ పోలీసులు ఉన్నతాధికారులు. అంతర్జాతీయ వేదికైన బ్రిక్స్ సమ్మిట్ లో డ్యూటీ చేస్తూ హై సెక్యూరిటీకి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఆ కానిస్టేబుల్ చిక్కుల్లో పడ్డాడు. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియా రీల్స్ వ్యామోహం ఓ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. అంతర్జాతీయ వేదికైన బ్రిక్స్ (BRICS) సమ్మిట్ 2026 విధుల్లో ఉండాల్సిన కానిస్టేబుల్ ను విధులనుంచి తొలగించింది ఢిల్లీ పోలీస్ శాఖ.. విధుల్లో భాగంగా తనకు కేటాయించిన ఆయుధాలు, వీవీఐపీల భద్రతా స్థానాలను సోషల్ మీడియా వీడియోల్లో బహిర్గతం చేయడంతో అతడిని విధుల నుంచి తొలగించి, శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
అసలేం జరిగింది?..
దేశ రాజధానిలో ప్రతిష్టాత్మక బ్రిక్స్ సమ్మిట్ జరుగుతుండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, బ్రిక్స్ సెక్యూరిటీ ఐడీ కార్డు ధరించిన ఓ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్, ప్రముఖ లగ్జరీ హోటళ్ల సమీపంలో తన బందోబస్తు ప్రాంతాలు, తుపాకులను చూపిస్తూ రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
నెటిజన్ల ఫిర్యాదుతో చర్యలు..
అత్యంత సున్నితమైన భద్రతా వివరాలు, వ్యూహాత్మక ప్రాంతాలు ఇలా పబ్లిక్‌గా వీడియోల్లో కనిపించడంతో పలువురు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు వెంటనే అతడిని గుర్తించి, బ్రిక్స్ భద్రతా విభాగం నుంచి తప్పించారు. సమ్మిట్ రూల్స్, భద్రతా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినందుకు అతనిపై అంతర్గత విచారణ చేస్తున్నట్లుఅధికారులు చెప్పారు.
