ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిన క్యూ లైన్లు

ఖైరతాబాద్  గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిన క్యూ లైన్లు

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల రద్దీ భారీగా పెరిగింది. గణపతి నవరాత్రి ఉత్సవాల మొదటి రోజే స్వామివారిని దర్శించుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సమయం గడిచేకొద్దీ ఖైరతాబాద్ పరిసరాల్లో భక్తుల సందడి మరింత పెరుగుతోంది. భక్తుల రాకతో దర్శనానికి ఏర్పాటు చేసిన క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. రద్దీ పెరగడంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీఐపీ మార్గంలో బ్యారికేడ్లను తొలగిస్తూ, రోప్ పార్టీ సహాయంతో భక్తులను క్రమపద్ధతిలో స్వామివారి దర్శనానికి పంపిస్తున్నారు.

ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ చుట్టూ సుమారు 100 మీటర్ల పరిధిలో వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ తెలిపారు.

►ALSO READ | పూరి జగన్నాథ్ ఆలయ నమూనాలో... బాలాపూర్ గణేష్ మండపం స్పెషల్ అట్రాక్షన్... 

ఐమాక్స్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వరకు వాహనాల ప్రయాణాన్ని నిలిపివేసినట్లు వెల్లడించారు. భక్తుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బడా గణేష్ పరిసరాల్లో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ట్రాఫిక్ సమస్యలు తొలగిస్తున్నారు.