వినాయకుడు అన్ని గుళ్లల్లో ఉంటాడు. అందరికంటే ముందే పూజలు అందుకుంటాడు కాబట్టి, అందరికీ ప్రత్యేకమే. వినాయకుడు హిందూ మతం సమ్ముతున్న ఒక దేవుడు మాత్రమే కాదు. గ్లోబల్గా పాపులర్ ఆయన.. ముంబై, పూనే నుంచి హైదరాబాద్, చెన్నై వరకు దేశంలో ఏ నగరానికి వెళ్లి చూసినా వినాయకచవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. తొమ్మిది రోజులు పూజించిన విగ్రహాన్ని.. పదో రోజున గంగమ్మ ఒడికి చేరుస్తారు. కాని దేశంలో ఓ ప్రదేశంలో పూజలు జరిగిన చెక్క గణపతిని నిమజ్జనం చేయరు . మళ్లీ గుళ్లో ఉంచి యథావిథిగా పూజలు నిర్వహిస్తారు.
వినాయక చవితి ఒక్క రోజు, రెండు రోజుల్లో ఉండే పండుగ కాదు. పది రోజులు అంటే తొమ్మది రాత్రిళ్లు. అందుకే గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు భక్తులు. దాదాపు అన్ని వీధుల్లో కొలువుతీరతాడు గణేశుడు. దీంతో బయటిదేశాల వాళ్ళు మనదేశంలో జరిగే ఉత్సవాల గురించి ఎప్పుడు మాట్లాడినా వినాయకుడి ప్రస్తావన ఉంటుంది.
వినాయకుడిని భారత దేశంలో ఒక పాపులర్ దేవుడిగా కొలుస్తారు. చిన్న పిల్లలకు, టీనేజీలో ఉన్నవాళ్లకు, పెద్దవాళ్లకు.. అందరికీ ఎంతో ఇష్టమైన దేవుడు వినాయకుడు. అందుకే ఆయన గ్లోబల్, హిందూమతాన్ని దాటి వేర్వేరు రూపాల్లో, పేర్లతో బౌద్ధ, జైన మతాల్లో కూడా వినాయకుడు ఉన్నాడు.
చెక్కలో చెక్కిన భక్తి.. తరతరాల నమ్మకం!
వినాయకచవితి అంటే కొత్త విగ్రహం... నవరాత్రులు.. నిమజ్జనం. కానీ మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో మాత్రం గణపయ్య కథ భిన్నం. ఇక్కడి వినాయకుడు మట్టితో చేసినవాడు కాదు.. ఒకే చెక్కలో చెక్కిన గణేశుడు. ఏటా వినాయక చవితి సందర్భంగా కొలువుదీరే ఈ కర్ర గణేశుడిని చూసేందుకు భక్తులు దూర ప్రాంతాలనుంచి తరలివస్తారు.
ఈ విగ్రహం వెనుక దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 1948లో నిర్మల్ కు చెందిన నకాశీ కళాకారుడు పోలకొండ గుండాజీ వర్మ చెక్కిన ఈ గణేశుడు.. పాలజ్ ప్రజల ఆరాధ్యదైవంగా మారాడు. నాలుగు చేతులతో, ఆయుధాలు, లడ్డూలతో సింహాసనంపై ఆసీనుడైన గణపయ్య రూపం చూపరులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. సాధారణంగా వినాయక చవితి తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. కానీ పాలజ్ గణేశుడిని మాత్రం నిమజ్జనం చేయరు.
పదకొండు రోజులపాటు పూజలు అందుకున్న అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, తిరిగి ఆలయంలో భద్రపరుస్తారు. వచ్చే ఏడాది మళ్లీ అదే గణపయ్య భక్తులకు దర్శనమిస్తాడు.
ఒకప్పుడు కష్టకాలంలో గ్రామస్తుల నమ్మకానికి రూపంగా ఏర్ప డిన ఈ విగ్రహం.. నేడు వారి సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. తరాలు మారినా గణపయ్య మారలేదు. చెక్క మారలేదు. కానీ ఆయనపై ప్రజల నమ్మకం మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
