దమ్ముంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ను ప్రతిపక్ష నేతను చేయండి: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

దమ్ముంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ను ప్రతిపక్ష నేతను చేయండి: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

మాక్ అసెంబ్లీ పెట్టి బీసీ నేతకు ముఖ్యమంత్రి స్థానం కల్పించడం కాదు.. దమ్ముంటే బీసీ నేతను ప్రతిపక్ష నేతను చేయండి అని సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 2026 సెప్టెంబర్ 14న గాంధీభవన్ లో మాట్లాడిన ఆయన.. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ప్రతిపక్ష నేత చేయాలని డిమాండ్ చేశారు.

ఎలాగో కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదు కదా.. బీసీలు, ఎస్సీలపై కపట ప్రేమ ఎందుకు.. కేసీఆర్ స్థానంలో తలసానిని ప్రతిపక్ష నేతను చేయండి అని సవాల్ విసిరారు. అలాగైతే సస్పెన్షన్ ఎత్తివేయిస్తానని చెప్పారు. ఊరకే మాయట మట్టలు చెప్పి దళితులు, బీసీల ఓట్లు దండుకోవడం కాదన్నారు.  

దళితుల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదన్నారు పీసీసీ చీఫ్. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారు.. మూడెకరాల భూమి, దళిత బంధును పట్టించుకోలేదు..  ఏనాడు దళితులను పట్టించుకోలేదు అంటూ విమర్శలకు దిగారు. అంబేద్కర్ విగ్రహం పెట్టడం కాదు.. ఆయన సూచనలు పాటించాలని హితవు పలికారు. 

TRS2003 డాక్యుమెంట్ ను పట్టించుకోలేదన్నారు. దళితులు నడిచిన నేలను కాదు.. బుర్రలోని చెత్తను శుద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాలం మారిందని, దళితులు నగరానికి వచ్చారు.. దొరను ఫామ్ హౌస్ కు పరిమితం చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలపై, దళితులకు అవమానం జరిగితే ఇంకా కేసీఆర్ నుంచి స్పందన రాలేదని అన్నారు.  

దళిత స్పీకర్ ను అధ్యక్షా అనాల్సి వస్తుందని కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని ఆరోపించారు. విజన్  లేకుండా పాలించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.. అప్పులు కడుతూనే సంక్షేమం నడుపుతున్నామని చెప్పారు. ఇంకా రెండున్నరేళ్ల సమయంలో మిగతా హామీలు నెరవేరుస్తామని అన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు పీసీసీ చీఫ్.