Sree Vishnu: 2027 సంక్రాంతి రేసు మరింత రసవత్తరం.. శ్రీవిష్ణు నుంచి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

Sree Vishnu: 2027 సంక్రాంతి రేసు మరింత రసవత్తరం.. శ్రీవిష్ణు నుంచి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. పెద్ద హీరోల చిత్రాలతో పాటు కంటెంట్ ఉన్న చిన్న, మీడియం రేంజ్ సినిమాలు కూడా ఈ సీజన్‌ను టార్గెట్ చేస్తుంటాయి. ఇక 2027 సంక్రాంతి రేసు ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులు పండగ బరిలో తమ రిలీజ్ డేట్లను ప్రకటించగా.. తాజాగా మరో సినిమా కూడా ఈ రేసులోకి ఎంట్రీ ఇచ్చింది.

వినాయక చవితి సందర్భంగా టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కొత్త సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘సామజవరగమన’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజు, శ్రీవిష్ణు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

‘సామజవరగమన’తో ఇప్పటికే ఈ కాంబినేషన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. దీంతో మరోసారి రామ్ అబ్బరాజు-శ్రీవిష్ణు కలిసి ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌తో వస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సంక్రాంతి పండగ సీజన్‌కు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ మూవీకి మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ‘ఫ్యామిలీ ప్యాక్’ను 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

2027 సంక్రాంతి సినిమాల లిస్ట్ ఇదే..

‘మహాకాళి’- జనవరి 8, 2027
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి రేసును ముందుగా ప్రారంభించనుంది.

‘సంబరాల యేటి గట్టు’- జనవరి 12, 2027 
సాయి దుర్గా తేజ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం సంక్రాంతి బరిలోకి రానుంది.

‘జనవరి 12 విడుదల’- జనవరి 12, 2027
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్.

‘కాకా’- జనవరి 13, 2027
బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవనుంది.

‘జార్జ్ క్రిష్’- జనవరి 14, 2027

శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రానుంది.

‘ఫ్యామిలీ ప్యాక్’- సంక్రాంతి 2027 

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఖచ్చితమైన తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ఇలా చూస్తే 2027 సంక్రాంతి బరిలో ఇప్పటికే భారీ లైనప్ కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు శ్రీవిష్ణు లాంటి యంగ్ హీరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా చేరడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు స్టార్ హీరోల సినిమాలు.. మరోవైపు కంటెంట్, కామెడీని నమ్ముకున్న సినిమాలు.. ఇలా అన్ని జానర్ల చిత్రాలు ఒకే సీజన్‌లో పోటీ పడనున్నాయి. మరి ఈ సంక్రాంతి బాక్సాఫీస్‌పై ఏ సినిమా సత్తా చాటుతుందో చూడాలి. అంతేకాకుండా ఈ లిస్టులో ఇంకెన్ని సినిమాలు యాడ్ అవుతాయో కూడా చూడాలి.