OTT Movies: ఒక్కరోజే ఇన్ని సినిమాలా? ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. అన్నీ సస్పెన్స్ థ్రిల్లర్సే

OTT Movies: ఒక్కరోజే ఇన్ని సినిమాలా? ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. అన్నీ సస్పెన్స్ థ్రిల్లర్సే

వీకెండ్ వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వైపు చూసే ప్రేక్షకులకు ఈ వారం అదిరిపోయే ట్రీట్ రెడీగా ఉంది. ముఖ్యంగా శుక్రవారం సెప్టెంబర్ 18న ఒకేసారి పలు ఆసక్తికరమైన సినిమాలు, ఆంథాలజీలు స్ట్రీమింగ్‌కు రాబోతుండటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మరింత కలర్‌ఫుల్‌గా మారనున్నాయి. కామెడీ, హారర్, యాక్షన్, క్రైమ్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ సినిమాలు ఈ వీకెండ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చబోతున్నాయి.

రవితేజ ‘ఇరుముడి’.. యాక్షన్‌తో పాటు ఎమోషన్ కూడా!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ థియేటర్లలో మంచి స్పందన అందుకున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ త్రినాథ్ అనే పాత్రలో కనిపిస్తారు. గతంలో హింసాత్మకమైన జీవితాన్ని గడిపిన ఓ వ్యక్తి.. తన చిన్న కుమార్తె కోసం తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. కూతురి కోరిక మేరకు అయ్యప్ప దీక్ష చేపట్టే అతడి ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? కుటుంబం, గతం, నమ్మకం, ప్రమాదాల మధ్య అతడు ఎలా పోరాడాడు? అనేదే కథలో ఆసక్తికరమైన అంశం.

సస్పెన్స్, యాక్షన్‌తో పాటు తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరిగే ఈ కథ ఓటీటీలో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది. ఈ సినిమా సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుందనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. హర్ష కామెడీ కితకితలు!

హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఈటీవీ విన్‌లో సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బ్యాచిలర్ జీవితంలో పెళ్లి కోసం ఎదురయ్యే కుటుంబ ఒత్తిడి, సంబంధాలు చూసే హడావుడి, ప్రేమ-పెళ్లి చుట్టూ జరిగే గందరగోళాన్ని ఫన్‌గా చూపించే కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. సీరియస్ థ్రిల్లర్ల మధ్య కాస్త రిలీఫ్ కావాలనుకునే ఆడియన్స్‌కు ఇది మంచి కామెడీ ఛాయిస్‌గా నిలవనుంది.

‘లస్ట్ స్టోరీస్ 3’.. నాలుగు కథలు.. ఎన్నో రిలేషన్‌షిప్ ట్విస్టులు!

నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత పాపులర్ అయిన ఆంథాలజీ ఫ్రాంచైజీ ‘లస్ట్ స్టోరీస్’ మూడో భాగంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ ఆంథాలజీలో నాలుగు వేర్వేరు కథలను నలుగురు ప్రముఖ దర్శకులు తెరకెక్కించారు.

విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ నాలుగు కథల్లో ప్రేమ, కోరికలు, దాంపత్య బంధాలు, మనసులో దాచుకున్న భావాలు, రిలేషన్‌షిప్‌లో వచ్చే సంఘర్షణలు ప్రధానంగా కనిపించనున్నాయి. రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అదితి రావు హైదరి, రాధికా మదన్, సిద్ధార్థ్, విజయ్ వర్మ, అలీ ఫజల్ తదితరులు నటించారు.

‘తుడక్కమ్’.. కూతురి పోరాటమే కథ!

మోహన్‌లాల్ కుమార్తె విస్మయా మోహన్‌లాల్ హీరోయిన్‌గా పరిచయమైన మలయాళ చిత్రం ‘తుడక్కమ్’ కూడా సెప్టెంబర్ 18 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీను అనే యువతి తన తండ్రితో కలిసి ప్రశాంతంగా జీవిస్తుంటుంది. అనుకోని ఓ సంక్షోభం ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది.

►ALSO READ | వినాయక చవితి పూజలో జంటగా.. పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బా?

ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మీను చేసే పోరాటమే కథకు ప్రధాన బలం. మార్షల్ ఆర్ట్స్, యాక్షన్, సర్వైవల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ థ్రిల్లర్‌ను మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు.

‘మ్యాంగో పచ్చ’.. క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో మరో థ్రిల్లర్!

క్రైమ్ డ్రామా ‘మ్యాంగో పచ్చ’ కూడా ఈ వారం జియోహాట్‌స్టార్‌లోకి అడుగుపెడుతోంది. కన్నడలో రూపొందిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. క్రైమ్ ప్రపంచం, అనుమానాలు, సంఘర్షణలు చుట్టూ కథ సాగుతుండటంతో థ్రిల్లర్ ప్రియులకు ఇది మరో ఆప్షన్‌గా మారనుంది.

‘ది మమ్మీ’.. భయపెట్టడానికి రెడీ!

ఇక హారర్ ప్రియులకు ‘లీ క్రోనిన్‌స్ ది మమ్మీ’ మంచి ఛాయిస్. సెప్టెంబర్ 17 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ హారర్ సినిమా తెలుగు సహా పలు భాషల్లో అందుబాటులోకి రానుంది.

సినిమా కథలో ఓ జర్నలిస్టు కుమార్తె చిన్నతనంలో ఈజిప్టులో కనిపించకుండా పోతుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఆమె ఓ పురాతన సార్కోఫగస్‌లో దొరకడంతో కుటుంబం ఆనందానికి అవధులుండవు. కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిలో జరుగుతున్న వింత పరిణామాలు అసలు భయానక కథను బయటపెడతాయి. తన కూతురి తిరిగొచ్చిన ఆనందం కాస్తా.. ఆ కుటుంబానికి పీడకలగా మారుతుంది.

ఈ వీకెండ్ ఓటీటీ ఫీస్ట్ గ్యారెంటీ!

మొత్తంగా చూస్తే.. సెప్టెంబర్ 18 ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి రోజు. ఒకవైపు రవితేజ ‘ఇరుముడి’లాంటి యాక్షన్-ఎమోషనల్ డ్రామా.. మరోవైపు ‘తుడక్కమ్’లాంటి సర్వైవల్ థ్రిల్లర్.. ‘మ్యాంగో పచ్చ’లో క్రైమ్ ట్విస్టులు.. ‘లస్ట్ స్టోరీస్ 3’లో రిలేషన్‌షిప్ డ్రామా.. ఇక హారర్ ప్రియులను భయపెట్టేందుకు ‘ది మమ్మీ’! అంటే ఈ వీకెండ్ సస్పెన్స్, థ్రిల్, క్రైమ్, హారర్, కామెడీ.. అన్నీ ఒకే ఓటీటీ ప్లేట్‌లో! థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే వీకెండ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే ఆడియన్స్‌కు ఈ వారం ఓటీటీ పండగే మరి!