నోటీస్ పీరియడ్ పూర్తి చేయకుండా మానేస్తే కంపెనీలు బ్లాక్ మెయిల్ చేయవచ్చా? చట్టం ఏం చెబుతోంది?

నోటీస్ పీరియడ్ పూర్తి చేయకుండా మానేస్తే కంపెనీలు బ్లాక్ మెయిల్ చేయవచ్చా? చట్టం ఏం చెబుతోంది?

కంపెనీ మారాలని భావించే ఉద్యోగులకు 'నోటీస్ పీరియడ్' అనేది ఒక పెద్ద సవాల్‌గా మారుతుంది. కొన్ని కంపెనీల్లో ఈ గడువు చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉద్యోగులు వెంటనే వేరే కంపెనీకి మారే ప్రక్రియ కష్టమవుతుంది. అయితే నోటీస్ పీరియడ్ పూర్తి చేయకుండా ఎవరైనా మధ్యలోనే ఉద్యోగం మానేస్తే కంపెనీల వైఖరి ఎలా ఉంటుంది? చట్టపరంగా వారికి ఎలాంటి హక్కులు ఉన్నాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందా రండి..

కంపెనీల వైపు నుంచి కారణాలు ఏమిటి?
వ్యాపార కొనసాగింపు, బాధ్యతల బదిలీ, క్లయింట్ సంబంధాల రక్షణ, అలాగే కంపెనీకి చెందిన డేటా లేదా ఆస్తులను తిరిగి రాబట్టుకోవడం వంటి వివిధ కారణాల వల్ల కంపెనీలు ఉద్యోగులతో నోటీస్ పీరియడ్ చేయిస్తుంటాయి. ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే కొన్ని కంపెనీలు రిలీవింగ్ లెటర్లు, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి వెనుకాడతాయి.

బలవంతంగా పనిచేయించడం:
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రకారం బలవంతపు చాకిరీ నేరం. ఏ ఉద్యోగినైనా ఇష్టం లేకున్నా బలవంతంగా పనిచేయించలేరు. కాంట్రాక్ట్ చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని పనిచేయాలని కోర్టు ద్వారా కూడా బలవంతం చేయడం సాధ్యం కాదు. ఉద్యోగి నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకుండా వెళ్లిపోతే, కంపెనీలు కేవలం ఆర్థిక పరమైన నష్టపరిహారం, నోటీస్ పే రికవరీ కోసం మాత్రమే ప్రయత్నించగలవు. కానీ బలవంతంగా పని చేయించుకోలేవు.

►ALSO READ | సెలవులు, పండుగలు లేకుండా 12 ఏళ్లు వర్క్ చేశాడు.. ఒరాకిల్ లేఆఫ్స్‌పై టెక్కీ వైఫ్ కన్నీళ్లు

బెదిరింపులు చట్టబద్ధమైనవేనా?
ఉద్యోగిని భయపెట్టడానికి, వేరే కంపెనీల్లో ఉద్యోగం రాకుండా చేయడానికి కొందరు ఓనర్స్ బ్లాక్‌లిస్ట్ చేస్తామని బెదిరిస్తుంటారు. ఉద్యోగి పేరును బహిరంగంగా లేదా ఇతర కంపెనీలకు సర్క్యులేట్ చేసి భవిష్యత్తు జాబ్ అవకాశాలను దెబ్బతీయడానికి భారతదేశంలో ఎలాంటి చట్టబద్ధత లేదని సోనాల్షి దాస్ అనే న్యాయవాది చెప్పారు. అలా చేస్తే సదరు కంపెనీపై పరువు నష్టం, జీవనోపాధిని దెబ్బతీసినందుకు కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కాకపోతే కంపెనీల అంతర్గత రికార్డుల్లో 'డూ-నాట్-రీహైర్' ఫ్లాగ్స్ పెట్టుకోవడం మాత్రం చట్టబద్ధమైనదేనట.

బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్..
బ్యాక్‌గ్రౌండ్ చెక్ సమయంలో కంపెనీలు.. ఉద్యోగి ఎలాంటి ఎగ్జిట్ ఫార్మాలిటీస్ పూర్తి చేయకుండా వెళ్లిపోయారని నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు. ఇది ఒక అనధికారిక నిరోధకంగా పనిచేస్తుంది. అలాగే నోటీస్ పీరియడ్ నడుస్తున్న సమయంలోనే ప్రత్యర్థి కంపెనీల్లో చేరడాన్ని నిరోధించడానికి కొన్నిసార్లు కోర్టులు ఇంజెక్షన్ ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత ఉద్యోగిని ఎక్కడికీ వెళ్లకుండా ఆపడం మాత్రం భారతీయ కాంట్రాక్ట్ చట్టం సెక్షన్ 27 ప్రకారం 'వ్యాపార నిరోధక చట్టం' కిందకు వస్తుంది.