సెలవులు, పండుగలు లేకుండా 12 ఏళ్లు వర్క్ చేశాడు.. ఒరాకిల్ లేఆఫ్స్‌పై టెక్కీ వైఫ్ కన్నీళ్లు

సెలవులు, పండుగలు లేకుండా 12 ఏళ్లు వర్క్ చేశాడు.. ఒరాకిల్ లేఆఫ్స్‌పై టెక్కీ వైఫ్ కన్నీళ్లు

కష్టపడి పనిచేస్తే కంపెనీ గుర్తిస్తుంది, మన ఉద్యోగానికి ఎప్పటికీ ఢోకా ఉండదని అనుకోవడం భ్రమేనని మరోసారి రుజువైంది. కార్పొరేట్ దిగ్గజం ఒరాకిల్‌లో దాదాపు 12 ఏళ్లపాటు సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన సౌరభ్ అనే టెక్కీకి ఊహించని షాక్ తగిలింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది కంపెనీ. ఈ విషయాన్ని ఆయన భార్య పూజా సాహు లింక్డ్‌ఇన్‌లో ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

పండగలు, ఆసుపత్రి బెడ్ పై నుంచీ కూడా:
సౌరభ్ తన ఉద్యోగం పట్ల ఎంత అంకితభావంతో ఉన్నాడో ఆయన భార్య పూజా పోస్టులో వివరించారు. భార్య ఆసుపత్రిలో సర్జరీ సమయంలోనూ, న్యూ మెక్సికోలో హాలిడే ట్రిప్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా సౌరభ్ వర్క్ చేశాడట. దీపావళి, హోలీ, రక్షాబంధన్ వంటి పండగ రోజులతో పాటు వీకెండ్స్, పుట్టినరోజులు, పెళ్లిరోజులను కూడా లెక్కచేయకుండా కంపెనీ కోసమే పనిచేశాడని వెల్లడించింది ఆమె. ఇంట్లో పెంచుకుంటున్న కుక్కను చూసుకుంటూనే రాత్రి 3 గంటల వరకు పనిచేసి అనారోగ్యం పాలయ్యాడు. కానీ ఇంతటి కష్టానికి కంపెనీ నుంచి ఎలాంటి ప్రతిఫలం దక్కలేదని ఆమె వాపోయింది.

లాగిన్ కాకపోవడంతో..
రోజూ లాగానే ఉదయం సౌరభ్ తన ఆఫీస్ సిస్టమ్‌లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటే యాక్సెస్ రాలేదు. ఆ సాంకేతిక సమస్యను పరిశీలిస్తే అసలు విషయం అర్థమైంది. ఎలాంటి హెచ్చరిక లేదు, మేనేజర్ నుంచి ముందస్తు కాల్ లేదు, చివరికి ఒక చిన్న మాట కూడా చెప్పకుండా నేరుగా సిస్టమ్ యాక్సెస్ నిలిపివేయడంతో ఉద్యోగం పోయింట్లు తెలిసిందట. టెన్షన్ లేకుండా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే వ్యక్తికి కంపెనీ ఇచ్చిన వీడ్కోలు ఇది అంటూ భార్య పూజ అన్నారు.

కార్పొరేట్ మోజులో పడి జీవితాన్ని కోల్పోవద్దు: 
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. 12 సంవత్సరాలు, పండగలు, ఆసుపత్రి విజిట్లు అవేవీ కంపెనీకి లేఆఫ్ సమయంలో గుర్తుకురావు. బ్యాలెన్స్ షీట్లు చూసే కంపెనీలకు మనుషుల భావోద్వేగాలతో పనిలేదు అని ఒకరు రాశారు. ఉద్యోగం అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే సర్వస్వం కాదు. ఎంత కష్టపడినా అవసరం తీరిపోయాక ఎవరినైనా తీసిపారేస్తారు అని మరో మాజీ ఉద్యోగి హెచ్చరించారు. సౌరభ్ తో పనిచేసిన సహచరులు మాత్రం ఆయన టెక్నికల్ నైపుణ్యాలను, ఇంటిగ్రేషన్స్ లో ఆయన అనుభవాన్ని కొనియాడుతూ మంచి ఉద్యోగం త్వరలోనే దొరుకుతుందని ధైర్యం చెప్పారు.

ALSO READ : దుబాయ్ విమానాల ఆలస్యం: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ ప్రయాణికుల నిరసన!

ఒక చిన్న విరామం అవసరం:
ఉద్యోగం కోల్పోయిన వెంటనే మళ్లీ హడావుడిగా వేరే ఉద్యోగంలో చేరకుండా.. కొద్ది రోజులు విశ్రాంతి సమయం తీసుకోవాలని మరికొందరు సూచించారు. కుటుంబంతో గడుపుతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. ఏదేమైనా.. ఎంత నిజాయితీగా పనిచేసినా కార్పొరేట్ సంస్థల క్రూరమైన నిర్ణయాల ముందు జాబ్ సేఫ్టీ అనే మాటకు ఉండే విలువ ఎంత అనే విషయం ఈ ఘటన నిరూపిస్తోంది.