నానక్‌రామ్‌గూడ భూ వివాదం.. అల్లు అర్జున్ మామపై పోలీసులకు ఫిర్యాదు

నానక్‌రామ్‌గూడ భూ వివాదం.. అల్లు అర్జున్ మామపై పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డితో పాటు మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) పరిధిలోని మంత్రీ కాస్మోస్ భవన ప్రాంగణంలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి, గేటు తాళాలు పగులగొట్టి, అక్కడి నిర్మాణాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి ప్రాంగణంలో టిన్‌షీట్లు ఏర్పాటు చేశారని మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ ఘటనపై అసోసియేషన్ తరఫున పెద్దిరాజు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

►ALSO READ | Rana Daggubati: యాంకర్ పై వాటర్ బాటిల్ విసిరిన రానా.. సైమా వేదికపై అసలు ఏం జరిగిందంటే?

ఈ ఫిర్యాదు ప్రతులను డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఏసీపీలకు కూడా అసోసియేషన్ బాధ్యులు అందజేశారు. ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి బెదిరింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ పోలీసులను కోరింది.

ఈ భూ వివాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, అక్రమ ప్రవేశం, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.