MS Dhoni To Coach CSK: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హెడ్ కోచ్ పదవి నుంచి స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకున్న తర్వాత, తదుపరి కోచ్ ఎవరనే దానిపై ఊహాగానాలు తారస్థాయికి చేరాయి. ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సీఎస్‌కే కోచ్ రేసులో మాజీ క్రికెటర్ హేమాంగ్ బదానీ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. సీఎస్‌కే లాంటి దిగ్గజ ఫ్రాంచైజీకి బదానీ కోచ్‌గా వ్యవహరించే అర్హత లేదని తెగేసి చెప్పాడు.
ధోనీ ఉన్న చోట వేరే కోచ్ దేనికి:
తన యూట్యూబ్ ఛానెల్‌లో శ్రీకాంత్ మాట్లాడుతూ.. హేమాంగ్ బదానీ సీఎస్‌కే హెడ్ కోచ్ అవ్వడానికి ఏమాత్రం వీల్లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)లో అతను సాధించింది ఏమీ లేదు.. అతని కోసం సీఎస్‌కే ఎందుకు ఎగబడాలో నాకైతే అర్థం కావడం లేదు.. అసలు ఎంఎస్ ధోనీ జట్టులో ఉన్నప్పుడు వేరే కోచ్ అవసరం ఏముంది? ధోనీ ఒక్కడే హెడ్ కోచ్ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించగలడు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇండియన్ కోచ్ కావాలంటే పండిత్ బెస్ట్:
ఒకవేళ మహేంద్ర సింగ్ ధోనీ కచ్చితంగా భారతీయ కోచ్‌నే కోరుకుంటే, కేకేఆర్ మాజీ కోచ్ చంద్రకాంత్ పండిత్‌ను ఎంపిక చేసుకోవాలని శ్రీకాంత్ సూచించాడు. రంజీ, ఐపీఎల్ స్థాయిలో ట్రోఫీలు గెలిచిన అపార అనుభవం పండిత్‌కు ఉందన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్లేయర్ అయినవారికి లేదా డొమెస్టిక్, ఐపీఎల్‌లో అద్భుత రికార్డు ఉన్న కోచ్‌లకే సీఎస్‌కే బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేశాడు.
►ALSO READ | రోహిత్‌తో బెడ్‌రూమ్ సీక్రెట్స్: బిగ్‌బాస్ నటి షాకింగ్ కామెంట్స్.. హిట్‌మాన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం!
తొందరపాటు వద్దు.. డిసెంబర్‌లో ఆక్షన్:
డిసెంబర్‌లో మాత్రమే ఐపీఎల్ ఆక్షన్ జరగనుంది, కాబట్టి కొత్త కోచ్ ఎంపిక విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ తొందరపడాల్సిన అవసరం లేదని మాజీ చీఫ్ సెలక్టర్ శ్రీకాంత్ సలహా ఇచ్చాడు. ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. మరోవైపు డీసీ యాజమాన్యం జెఎస్‌డబ్ల్యూ హస్తగతమవుతుండటంతో సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్‌గా, యువరాజ్ సింగ్ అసిస్టెంట్ కోచ్‌గా డీసీ బాధ్యతలు స్వీకరించడం దాదాపు ఖాయమైంది.
