- సిటీ కాలేజీ, ఉస్మానియా ఆస్పత్రి పునరుద్ధరిద్దాం
- విద్య, వైద్యం, పర్యాటకాభివృద్ధికి కలిసి పనిచేద్దాం
- 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా నిలుపుదాం
- వారసత్వ సంపద పరిరక్షణలో ఆగాఖాన్ ఫౌండేషన్ సేవలు అమోఘం
- ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్- 5తో భేటీలో సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ 7 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్- 5ను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. మంగళవారం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌తో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి అజారుద్దీన్, సీఎస్ సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఆగా ఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల కన్నుమూసిన ప్రిన్స్ రహీమ్ తండ్రి, దివంగత ఆగా ఖాన్- 4 మృతికి సీఎం సంతాపం తెలిపారు. హైదరాబాద్‌తో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేస్తూ రాష్ట్రంలో విద్య, వైద్యం, పర్యాటక రంగాల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని కోరారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను ప్రస్తుతమున్న 2.5 శాతం నుంచి 10 శాతానికి పెంచేందుకు సమగ్ర ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం వివరించారు.
హైదరాబాద్ వారసత్వ సంపద పరిరక్షణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను సీఎం కొనియాడారు. ఫౌండేషన్ భాగస్వామ్యంతో పునరుద్ధరించిన కుతుబ్ షాహీ సమాధులు, ఇటీవల నూతనంగా ప్రారంభించుకున్న చారిత్రక శాసనమండలి భవన నిర్మాణాల విశేషాలను సీఎం ప్రస్తావించారు. ఇదే స్ఫూర్తితో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులోనూ భాగస్వాములు కావాలని ఆగా ఖాన్ ఫౌండేషన్‌ను ఆహ్వానించారు. ఈసా, మూసీ నదుల సంగమ ప్రాంతంలో కాలుష్య కోరల్లో చిక్కుకున్న మూసీని ప్రక్షాళన చేసి అంతర్జాతీయ స్థాయిలో ‘నైట్ ఎకానమీ’ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న చారిత్రక సిటీ కాలేజ్ భవనంతో పాటు శతాబ్దాల చరిత్ర కలిగిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవనాన్ని వారసత్వ సంపదగా గుర్తించి పునరుద్ధరించే బాధ్యతను ఫౌండేషన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో అత్యాధునిక నూతన భవనాన్ని నిర్మిస్తున్నందున, ప్రస్తుత పురాతన భవనాన్ని సంరక్షించి భావితరాలకు అందించేలా అభివృద్ధి చేయాలని కోరారు.
భారత్ ఫ్యూచర్ సిటీ’పై ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ ఆసక్తి
ప్రతిష్టాత్మకంగా 30 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’పై ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ సంస్థ రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌ను సీఎం ఆయనకు వివరిస్తూ.. ఇందులో 15 వేల ఎకరాలను ప్రత్యేకంగా గ్రీన్ జోన్‌గా కేటాయించి, దేశంలోనే మొట్టమొదటి పర్యావరణహిత నెట్-జీరో నగరంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఇప్పటికే అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజ సంస్థలు ఫ్యూచర్ సిటీలో కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. ఈ అత్యాధునిక నగరంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ‘ఆగా ఖాన్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా ప్రతిపాదించారు. బ్రిటన్, అమెరికా పర్యటనల్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి అంతర్జాతీయ విద్యాసంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల తరహాలోనే ఆగా ఖాన్ విద్యాసంస్థలు సైతం తెలంగాణలో తమ ప్రాంగణాన్ని నెలకొల్పాలని కోరారు.
పర్యాటక, విద్యా రంగాల విస్తరణకు సహకరించాలి
రాష్ట్రంలో పర్యాటక, విద్యా రంగాల విస్తరణలో ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ (ఏకేటీసీ) పాత్రను పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ గుర్తుచేస్తూ.. భవిష్యత్తులో ఈ సహకారాన్ని మరింత విస్తృతం చేయాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 7 నుంచి జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో 100కు పైగా దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు హాజరుకానున్నందున, ఈ వేదికతో నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పారిశ్రామిక విధానాలు, వారసత్వ సంరక్షణ చర్యలపై ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ హర్షం వ్యక్తం చేస్తూ సానుకూలంగా స్పందించారు.
సామాన్యుడిపై యూపీఐ చార్జీల భారం వద్దు: సీఎం రేవంత్
యూపీఐ పేమెంట్లపై కేంద్రం వెంటనే స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్‌చేశారు. ₹2,000కు పైబడిన వ్యాపార లావాదేవీలపై పెరిగిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) దేశంలోని జీరో-ఎండీఆర్ డిజిటల్ చెల్లింపుల విధానానికి ముప్పుగా మారుతుందన్నారు. కస్టమర్ల నుంచి నేరుగా ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని కేంద్రం చెప్పొచ్చని, అయితే వ్యాపారులపై చార్జీల భారం మోపితే ఆ ఖర్చును వారు పెరిగిన ధరల రూపంలో వినియోగదారులపైకి బదిలీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎండీఆర్‌లో ఏ పెరుగుదల అయినా సామాన్య ప్రజలపై పడే పరోక్ష పన్నుగానే మారుతుందన్నారు. డిజిటల్ చెల్లింపుల ఖర్చులు పెరిగితే చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు ఎందుకు భరించాలని ప్రశ్నించారు. పెరిగిన ఎండీఆర్ నుంచి యూపీఐ లావాదేవీలను రక్షించేందుకు కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. యూపీఐని ఎలాంటి ఎండీఆర్ లేకుండా కొనసాగించే పాలసీపై తక్షణమే క్లారిటీ ఇవ్వాలని కోరారు.
