ప్రతి ఏటా బ్రిక్స్ దేశాధినేతలు సమావేశమవుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అసమానతలను ప్రస్తావిస్తూ, అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థలో సమూల మార్పులు రావాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అమెరికా డాలర్ ఆధిపత్యానికి తెరదించాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు విధాన నిర్ణయాల్లో సముచిత ప్రాధాన్యం కల్పించాలని తీర్మానాలు చేస్తున్నారు.
ప్రపంచాన్ని బహుళ-ధ్రువ వ్యవస్థగా మలచాలన్న నినాదాలు నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి. అయితే దాదాపు రెండు దశాబ్దాల ప్రస్థానం తర్వాత బ్రిక్స్ నిజంగా అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే స్థాయికి ఎదిగిందా? లేక ఏటా కొత్త ప్రకటనలు విడుదల చేస్తూ, పాత హామీలకే పరిమితమైన దౌత్య వేదికగా మిగిలిపోయిందా? 18వ బ్రిక్స్ సదస్సు న్యూఢిల్లీలో ముగిసిన నేపథ్యంలో ఈ సమగ్ర విశ్లేషణ అనివార్యంగా మారింది.
2001లో గోల్డ్‌మ్యాన్ సాక్స్ ఆర్థికవేత్త జిమ్ ఓనీల్ ‘బ్రిక్’ అనే సంక్షిప్త నామాన్ని ప్రతిపాదించగా, 2006లో ప్రభుత్వాల మధ్య దౌత్య సమన్వయం ప్రారంభమైంది. 2009లో రష్యాలోని యెకతెరిన్‌బర్గ్‌లో తొలి దేశాధినేతల సదస్సు జరిగింది. 2011లో దక్షిణాఫ్రికా చేరికతో ‘బ్రిక్స్’గా మారిన ఈ వేదిక, ఇటీవలి విస్తరణతో 11 సభ్యదేశాల విస్తృత కూటమిగా రూపాంతరం చెందింది. ఈ కూటమి ప్రాథమిక లక్ష్యం పాశ్చాత్య దేశాలను ఢీకొట్టడం కాదు; దశాబ్దాలుగా పాశ్చాత్య శక్తుల నియంత్రణలో ఉన్న ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల్లో గ్లోబల్ సౌత్ దేశాల వాటాను పెంచడం.
మెరుగైన వాణిజ్యం
గడచిన పద్దెనిమిదేళ్లలో బ్రిక్స్ కొన్ని సంస్థాగత ప్రత్యామ్నాయాలను నిర్మించడంలో విజయం సాధించింది. 2015లో కార్యకలాపాలు ప్రారంభించిన ‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్’ (NDB) ఇప్పటికే దాదాపు 35 బిలియన్ డాలర్ల పైచిలుకు విలువైన మౌలిక వసతులు, స్వచ్ఛ ఇంధన, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చింది. పాశ్చాత్య బ్యాంకుల మాదిరిగా కఠిన రాజకీయ ఆంక్షలు విధించకుండా రుణాలు ఇవ్వడం దీని ప్రత్యేకత.
అలాగే ఆర్థిక సంక్షోభ సమయాల్లో సభ్యదేశాలకు రక్షణగా వంద బిలియన్ డాలర్లతో ‘కాంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్’ ఏర్పాటు చేశారు. సభ్యదేశాల మధ్య పరస్పర వస్తు వాణిజ్యం 2003లో 8,420 కోట్ల డాలర్ల నుంచి 2024 నాటికి 1.17 లక్షల కోట్ల డాలర్ల రికార్డు స్థాయికి చేరింది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్ వంటి దేశాల చేరికతో బ్రిక్స్ కేవలం ఆర్థిక వేదికగానే కాకుండా అంతర్జాతీయ ఇంధన రాజకీయాల కేంద్రంగా మారింది. ప్రపంచ ముడి చమురు ఉత్పత్తిలో 40 శాతానికి పైగా వాటా, హార్మూజ్ జలసంధి వంటి కీలక సముద్ర వాణిజ్య మార్గాలు ఇప్పుడు ఈ కూటమి పరిధిలోకి వచ్చాయి. దశాబ్దాలుగా అంతర్జాతీయ వాణిజ్యాన్ని శాసిస్తున్న ‘పెట్రో-డాలర్’ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా భారత్- –యూఏఈ మధ్య రూపాయి- దిర్హామ్ తరహా స్థానిక కరెన్సీల చమురు కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి.
విజయాల వెనుక లోపాలు
బ్రిక్స్ విజయాల వెనుక కొన్ని లోపాలు కూడా కనిపిస్తున్నాయి. కొనుగోలు శక్తి ఆధారిత స్థూల జాతీయోత్పత్తిలో (PPP GDP) బ్రిక్స్ దేశాల వాటా దాదాపు 36 శాతానికి చేరినా, ఐఎంఎఫ్‌లో వీటి ఓటింగ్ హక్కులు కేవలం 15 శాతానికే పరిమితమయ్యాయి. ఈ అసమానతలను సరిదిద్దేందుకు ఏటా తీర్మానాలు చేస్తున్నా, వాటిని ప్రపంచ వేదికలపై అమలు చేయించడంలో కూటమి విఫలమవుతోంది.
రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాను ‘స్విఫ్ట్’ (SWIFT) వ్యవస్థ నుంచి బహిష్కరించడం ద్వారా కరెన్సీని ఆయుధంగా మలచవచ్చని నిరూపించాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ‘బ్రిక్స్ పే’ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ తెరపైకి వచ్చినప్పటికీ, ఉమ్మడి బ్రిక్స్ కరెన్సీ రూపకల్పన సాధ్యపడడం లేదు. సభ్యదేశాల ఆర్థిక క్రమశిక్షణ, ద్రవ్యోల్బణ వ్యత్యాసాలు, వడ్డీరేట్ల విధానాలు పరస్పరం పూర్తి భిన్నంగా ఉండటమే ఇందుకు ప్రధాన అడ్డంకి.
అంతర్గత వైరుధ్యాల బలహీనత
బ్రిక్స్ అంతర్గత వైరుధ్యాలు మరో బలహీనత. కూటమి స్వభావంపై సభ్యదేశాల మధ్య స్పష్టమైన ఏకాభిప్రాయం లేదు. చైనా, రష్యాలు బ్రిక్స్‌ను అమెరికాకు వ్యతిరేకమైన ‘యాంటీ-వెస్ట్రన్’ కూటమిగా మలచాలని చూస్తుండగా, భారత్, బ్రెజిల్ మాత్రం గ్లోబల్ సౌత్ ప్రయోజనాల పరిరక్షణ కోసం పని చేసే ‘నాన్-వెస్ట్రన్’ స్వతంత్ర వేదికగానే నిలపాలని పట్టుబడుతున్నాయి. భారత్‌కు చైనాతో సరిహద్దు ప్రతిష్టంభనలు ఉన్నప్పటికీ, అమెరికాతో సాంకేతిక, ఆర్థిక సంబంధాలను పణంగా పెట్టే ఉద్దేశం లేదు. విచిత్రమేమిటంటే, ఐరాస భద్రతా మండలిలో సమూల మార్పులు కోరుతూ ఢిల్లీ డిక్లరేషన్‌లో సంతకం చేస్తున్న చైనానే, వాస్తవానికి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వాన్ని అడ్డుకుంటోంది. కూటమిలోని రెండు అగ్రదేశాల మధ్యే పూర్తి స్థాయి వ్యూహాత్మక విశ్వాసం లేనప్పుడు, ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అంత సులభం కాదు.
న్యూఢిల్లీ డిక్లరేషన్
న్యూఢిల్లీ డిక్లరేషన్ ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని స్పష్టమైన ప్రాధాన్యతలను నిర్దేశించింది. ఇకపై నినాదాలకే పరిమితం కాకుండా ‘ఫలితాల ఆధారిత’ వేదికగా పనిచేయాలని నిర్ణయించింది. స్థానిక కరెన్సీల అనుసంధానం, సరఫరా వ్యవస్థల భద్రత కోసం 2026–2030 కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది. ఇక్కడ భారత్ తన ‘డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ (యూపీఐ తరహా మోడల్స్) సామర్థ్యాన్ని గ్లోబల్ సౌత్ దేశాలకు అందించడం ద్వారా ఒక నిర్మాణాత్మక మార్పుకు నాంది పలకవచ్చు.
బ్రిక్స్ దీర్ఘకాలిక ప్రత్యామ్నాయం
పద్దెనిమిదేళ్ల బ్రిక్స్ ప్రస్థానం పూర్తిగా విఫలమైన ప్రయోగం కాదు. అలాగని అంతర్జాతీయ వ్యవస్థను తిరగరాసిన శక్తి కూడా కాదు. ఇది పాశ్చాత్య గుత్తాధిపత్యానికి సమాంతరంగా రూపొందుతున్న ఒక దీర్ఘకాల ప్రత్యామ్నాయ వ్యవస్థ. అంతర్గత విభేదాలను పక్కనపెట్టి, స్థానిక కరెన్సీల్లో వాణిజ్యాన్ని, సాంకేతిక మార్పిడిని ఎంత వేగంగా ఆచరణలోకి తెస్తారనే దానిపైనే దీని మనుగడ ఆధారపడి ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ రాజకీయాలను మార్చేది డిక్లరేషన్లలోని ఆకర్షణీయమైన పదబంధాలు కాదు.. నేలమీద కనిపించే స్పష్టమైన ఫలితాలు మాత్రమే.
- శ్రీనివాస్ గౌడ్ ముద్దం,
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన
మెయిల్ ఐడీ[email protected]
రచన 700 పదాలకు మించరాదు.
