- పల్లెల్లో రాష్ట్రవ్యాప్తంగా పక్షం రోజుల పాటు ..
- పారిశుధ్య కార్యక్రమాలు
- అక్టోబర్ 1న ఉదయం 8 గంటలకు ‘ఏక్ దిన్,
- ఏక్ ఘంటా, ఏక్ సాత్’ మహా శ్రమదానం
- చెత్త పేరుకుపోయిన బ్లాక్ స్పాట్ల శాశ్వత ప్రక్షాళన
- పారిశుధ్య కార్మికులకు హెల్త్ క్యాంపులు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సర్కార్ రెడీ అయింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 (గాంధీ జయంతి) వరకు 15 రోజుల పాటు ‘స్వచ్ఛతా హి సేవ–2026’ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. స్వచ్ఛతలో భాగస్వామ్యం–స్వచ్ఛ భారత్, వికసిత భారత్(స్వచ్ఛతా మే సహభాగ్, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్) అనే నినాదంతో సాగనుంది.
హైదరాబాద్, మేడ్చల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ్) డైరెక్టర్ దివ్య దేవరాజన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 15 నాటికి జిల్లా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని, పారిశుధ్య పనుల వివరాలను రోజూ ప్రత్యేక పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ఈ పక్షోత్సవాల్లో భాగంగా 5 ప్రధాన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
గ్రామాలు, పట్టణాల్లో ఏళ్ల తరబడి మురికికూపాలుగా మారిన ప్రాంతాలు, బహిరంగ చెత్త డంపింగ్ యార్డులను యుద్ధప్రాతిపదికన క్లియర్ చేసి తీర్చిదిద్దనున్నారు. మంగళవారం నుంచి ఆయా ప్రాంతాలను గుర్తించి జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియ ప్రారంభించారు. పాఠశాలలు, కాలేజీల్లో ‘స్వచ్ఛతా జ్ఞాన యాత్ర’ పేరిట వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల విజిట్స్, ‘స్వచ్ఛత -జల సంచయ్’ పేరుతో నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వపై చర్చలు, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు.
పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి పీపీఈ కిట్లు, సేఫ్టీ గేర్లు అందజేయనున్నారు. పీఎం ఆవాస్, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల, పీఎం జీవన్ జ్యోతి వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీరికి అనుసంధానించనున్నారు.
నాలుగు రకాలుగా చెత్త వేరుచేసే విధానంపై ఇంటింటి ప్రచారం, క్రీడా పోటీలు(స్పోర్ట్స్ ఫర్ స్వచ్ఛత), గణేశ్ ఉత్సవాల్లో పర్యావరణహిత విగ్రహాలు, ఎకో- ఫ్రెండ్లీ పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించడం, చెత్తతో కళాఖండాల ద్వారా ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలతో పార్కులు, చౌరస్తాల్లో శిల్పాలు, కళాకృతులు రూపొందించనున్నారు. ఆర్ఆర్ఆర్(రీడ్యూస్, రీయూజ్, రీసైకిల్) సెంటర్లను బలోపేతం చేయనున్నారు.
అక్టోబర్ 1న దేశవ్యాప్తంగా మహా శ్రమదానం
ఈ ప్రచారంలో ముఖ్యంగా అక్టోబర్ 1న ఉదయం 8 గంటలకు ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్’ (ఒకే రోజు, ఒకే గంట, అందరం కలిసి) పేరిట దేశవ్యాప్త శ్రమదాన కార్యక్రమం జరగనుంది. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, రిటైర్డ్ సైనికులు, పద్మ అవార్డు గ్రహీతలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, సాధారణ పౌరులు ఒకే సమయంలో స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొని పరిసరాలను శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం ముగింపు రోజైన అక్టోబర్ 2న గాంధీ జయంతిని ‘స్వచ్ఛ భారత్ దివస్’గా నిర్వహించనున్నారు. పల్లెల్లో ప్రత్యేక గ్రామసభలు, పట్టణాల్లో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి ఘన వ్యర్థాల నిర్వహణపై చర్చిస్తారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీలు, పారిశుధ్య కార్మికులు, వలంటీర్లకు సన్మానించనున్నారు. శుభ్రం చేసిన ప్రాంతాల్లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ నినాదంతో భారీగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు.
