పోలీసులను నెట్టివేయాలని ఎవరు ఆదేశించారు?

పోలీసులను నెట్టివేయాలని ఎవరు ఆదేశించారు?
  • ముందస్తు ప్రణాళికతోనేగొడవకు దిగారా?
  • కేటీఆర్‌‌ పీఏ, పీఆర్వో విచారణ
  • ఆ ఇద్దరిపై పోలీస్‌‌స్టేషన్‌‌లో దాడి జరిగిందంటూ బీఆర్‌‌ఎస్‌‌ నేతల ఆందోళన
  • ఎవరిపైనా దాడి జరగలేదని డీసీపీ శిల్పవల్లి క్లారిటీ

సైఫాబాద్, వెలుగు: అసెంబ్లీ వద్ద ఈ నెల 7న జరిగిన ఘటనపై సైఫాబాద్‌‌ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారన్న ఆరోపణలపై బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ పీఏ మహేందర్‌‌ రెడ్డి, పీఆర్వో మహేశ్​పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వారు హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్‌‌ మంజూరు చేసింది. పోలీసుల నోటీసుల మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు బీఆర్‌‌ఎస్‌‌ లీగల్‌‌ సెల్‌‌ ప్రతినిధులతో కలిసి ఆ ఇద్దరూ సైఫాబాద్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌కు హాజరయ్యారు.

సైఫాబాద్‌‌ సీఐ నాగేశ్వర్‌‌ రావు వారిని సుమారు 9 గంటల పాటు విచారించినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న గొడవకు దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించి ఎవరి ఆదేశాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు ప్రశ్నించినట్టు తెలిసింది. విధుల్లో ఉన్న పోలీసులను నెట్టివేయాలని ఎవరు ఆదేశించారు? ముందస్తు ప్రణాళికతోనే గొడవకు దిగారా? తదితర అంశాలపై వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.

సీన్‌‌ రీకన్‌‌స్ట్రక్షన్‌‌

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మహేందర్‌‌ రెడ్డి, మహేశ్​ను అసెంబ్లీ గేట్‌‌ నంబర్‌‌-3 వద్దకు తీసుకెళ్లి సీన్‌‌ రీకన్‌‌స్ట్రక్షన్‌‌ నిర్వహించారు. ఘటన జరిగిన సమయంలో ఏం జరిగింది? తోపులాటకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాలను వారి నుంచి తెలుసుకుని స్టేట్‌‌మెంట్‌‌ నమోదు చేసినట్టు తెలిసింది. అయితే, సీన్‌‌ రీకన్‌‌స్ట్రక్షన్‌‌కు తీసుకెళ్తున్న సమయంలో బీఆర్‌‌ఎస్‌‌ లీగల్‌‌ సెల్‌‌కు చెందిన న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. కోర్టు ఆదేశాలు లేకుండా సీన్‌‌ రీకన్‌‌స్ట్రక్షన్‌‌ చేయొద్దంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేయగా.. విచారణలో భాగంగానే ప్రక్రియ నిర్వహిస్తున్నామని పోలీసులు సర్దిచెప్పినట్టు తెలిసింది.

పోలీస్‌‌ స్టేషన్‌‌ వద్ద ఉద్రిక్తత

సీన్‌‌ రీకన్‌‌స్ట్రక్షన్‌‌ అనంతరం మహేందర్‌‌ రెడ్డి, మహేశ్​ను తిరిగి సైఫాబాద్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌కు తీసుకొచ్చారు. సోమవారం సాయంత్రం విచారణ ముగుస్తున్న సమయంలో తమపై దాడికి ప్రయత్నం జరిగిందంటూ వారిద్దరూ సోషల్‌‌ మీడియాలో ప్రచారం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌‌కు చెందిన 15 మంది కార్యకర్తలు మాస్కులు ధరించి పోలీస్‌‌స్టేషన్‌‌లోకి వచ్చి తమపై దాడికి యత్నించారని వారు ఆరోపించారు. దీంతో బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌‌యాదవ్‌‌, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌‌ తోపాటు పెద్ద సంఖ్యలో బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు, కార్యకర్తలు సైఫాబాద్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌కు చేరుకుని ఆందోళనకు దిగారు.

దీంతో స్టేషన్​ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, కేటీఆర్‌‌ పీఏ, పీఆర్వోపై పోలీస్‌‌స్టేషన్‌‌లో ఎలాంటి దాడి జరగలేదని ఖైరతాబాద్‌‌ జోన్‌‌ డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. గణేశ్ మండపం వద్ద డీజేకు అనుమతి కోరుతూ స్థానిక యువకులు సాయంత్రం పోలీస్‌‌స్టేషన్‌‌కు వచ్చారని.. వారిలో ఒకరు మహేశ్​ను గుర్తించి.. అసెంబ్లీ వద్ద న్యూసెన్స్‌‌ చేసిన వారిని పోలీసులు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారని అనడంతో వాగ్వాదం జరిగినట్టు తెలిపారు. కేటీఆర్‌‌ పీఏ, పీఆర్వోలపై దాడి జరిగిందంటూ బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు పైనా దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ తెలిపారు.