- ఏఐసీసీ సెక్రటరీలతో రాహుల్, వేణుగోపాల్ భేటీ
- తెలంగాణ నుంచి హాజరైన ఏఐపీసీ చైర్మన్ మధు యాష్కీ
-న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ప్రక్షాళనపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. వరుస పరాజయాలు, రాష్ట్రాల్లో బలహీనపడుతున్న పార్టీ యంత్రాంగం, రానున్న ఎన్నికల నేపథ్యంలో సంస్థాగత వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించాలని నిర్ణయిచింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ మంగళవారం ఢిల్లీలో 10 జనపథ్ లో ఏఐసీసీ సెక్రటరీలతో సమావేశమయ్యారు.
ఈ భేటీలో తెలంగాణ నేత, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్ మధు యాష్కీ పాల్గొన్నారు. రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితి, సంస్థాగత నిర్మాణం, నాయకత్వ పనితీరు, క్షేత్రస్థాయిలో పార్టీకి ఎదురవుతున్న సమస్యలపై సమీక్షించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉండేలా పార్టీ వ్యవస్థను రూపొందించాలన్న లక్ష్యంతో నాయకత్వం ముందుకు సాగుతున్నట్టు తెలిపాయి. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే ప్రచార రాజకీయాలను దాటి, గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
సామాజిక సమీకరణాలపై దృష్టి..
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాల్లో పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచే సామర్థ్యాన్ని పెంచుకోవడం కాంగ్రెస్ ముందున్న ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. పార్టీ యంత్రాంగాన్ని క్రియాశీలం చేయడం, ప్రజా సమస్యలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడం, ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడం, పార్టీ శ్రేణులను ఉద్యమాల వైపు మళ్లించడం వంటి అంశాలపై అధిష్టానం దృష్టి సారించినట్టు సమాచారం. ఇటీవల పార్టీలు చేపట్టిన తాజా నియామకాల్లో సామాజిక ప్రాతినిధ్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులను కీలక రాష్ట్రాల బాధ్యతల్లోకి తీసుకురావడం ద్వారా ఆయా వర్గాల్లో పార్టీకి ఉన్న దూరాన్ని తగ్గించుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. సంస్థాగత మార్పులు కేవలం పదవుల మార్పిడిగా కాకుండా పార్టీ సామాజిక పునాదిని విస్తరించే ప్రక్రియగా ఉండాలని నాయకత్వం భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కాగా, తాజా భేటీతో కాంగ్రెస్‌లో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మరింత వేగంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రాల వారీగా పనితీరును సమీక్షించి, అవసరమైన చోట నాయకత్వ మార్పులు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
