న్యూఢిల్లీ: యార్కర్లను అస్త్రంగా మలచి ప్రపంచ స్థాయి బ్యాటర్లను వణికిస్తున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రయాణంపై పుస్తకం రానుంది. ‘ది బూమ్ ఎఫెక్ట్’ పేరుతో వెలువడుతున్న ఈ పుస్తకం వచ్చే నెలలో పాఠకుల ముందుకు రానుంది. ప్రముఖ క్రీడా జర్నలిస్టులు ఆయుష్ పుత్రాన్, నికోలస్ బ్రూక్స్ సంయుక్తంగా ఈ పుస్తకాన్ని రచించారు. పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సంస్థకు చెందిన 'ప్లే' ఇంప్రింట్ కింద ఇది ప్రచురితమవుతోంది.
అహ్మదాబాద్‌లో సాధారణ క్రికెటర్‌గా ప్రయాణం ప్రారంభించి, ప్రపంచంలోనే అత్యంత భయపెట్టే ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా ఎలా ఎదిగాడనే అంశాలను ఈ పుస్తకం వివరిస్తుంది. సాధారణ భారతీయ క్రికెటర్లలాగ ఎలైట్ అకాడమీలు లేదా అండర్-–19 వ్యవస్థ నుంచి బుమ్రా రాలేదు. ఎలాంటి సాంప్రదాయ నేపథ్యం లేకుండా, విభిన్నమైన బౌలింగ్ యాక్షన్, షార్ట్ రనప్‌తో ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి చేరుకున్న తీరును ఇందులో పొందుపరిచారు. గుజరాత్ క్రికెట్ నుంచి ముంబై ఇండియన్స్ ద్వారా టీమిండియాకు ఎంపిక కావడం వరకు జరిగిన ప్రయాణాన్ని మూడు భాగాలుగా ఈ పుస్తకంలో విశదీకరించారు.
