హైదరాబాద్, వెలుగు: జపాన్‌లోని ఐచి–నగోయాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న 20వ ఆసియా క్రీడలు–2026లో భారత సెపక్ తక్రా బృందం ప్రతినిధిగా తెలంగాణ సెపక్ తక్రా అధ్యక్షుడు పెరిక సురేష్ ఎంపికయ్యారు. సెపక్ తక్రా క్రీడ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం దక్కినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసియా క్రీడల్లో తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక సెపక్ తక్రా ప్రతినిధిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి అంతర్జాతీయ వేదికపై సేవ చేసే అవకాశం కల్పించినందుకు సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆసియా సెపక్ తక్రా సమాఖ్య అధ్యక్షుడు డాటుక్ అబ్దుల్ హలీం బిన్ కాదర్, సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
