- కార్మికుడికి తీవ్ర గాయాలు
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కళ్యాణిఖని-5 సింగరేణి అండర్‌గ్రౌండ్ బొగ్గు గనిలో పైకప్పు బండరాళ్లు, బొగ్గు పెళ్లలు కూలిన ఘటనలో ఎస్డీఎల్ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని పసిగట్టిన కార్మికుడు యంత్రం నుంచి దూకి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో నైట్ షిఫ్ట్ విధుల్లో భాగంగా గనిలోని 3 సీమ్, 14, 14.5 లెవల్ వద్ద ఉన్న నాన్ వర్కింగ్ ప్లేస్‌లో ఎస్డీఎల్ ఆపరేటర్ కస్తూరి శంకర్ ఎస్డీఎల్ యంత్రంతో బొగ్గు వెలికితీసే పనులు చేపట్టాడు.
ఒక్కసారిగా పైకప్పు బండరాళ్లు, బొగ్గు పెళ్లలు పెద్ద ఎత్తున ఎస్డీఎల్ యంత్రంపై కూలాయి. ప్రమాదాన్ని పసిగట్టిన శంకర్ వెంటనే యంత్రం నుంచి దూకి బయటకు రావడంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో ఆయన మెడ, వెన్నుముక భాగంలో ఫ్రాక్చర్ కాగా, శరీరంలోని పలు చోట్ల గాయాలయ్యాయి.
బొగ్గు పెళ్లలు పెద్ద ఎత్తున పడటంతో ఎస్డీఎల్ యంత్రం, కెనోపీ పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన శంకర్‌ను వెంటనే రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం మంగళవారం కరీంనగర్‌కు తరలించారు.
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సీఐటీయూ అధ్యక్షుడు ఎస్.వెంకటస్వామి పరామర్శించారు. పనిస్థలాల్లో రక్షణ చర్యలు చేపట్టడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు.
