ఆదిలాబాద్ : నకిలీ కరెన్సీ కోసం రూ.5 లక్షలు రాబట్టేందుకు కిడ్నాప్..కారు, మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం

ఆదిలాబాద్ : నకిలీ కరెన్సీ కోసం రూ.5 లక్షలు రాబట్టేందుకు కిడ్నాప్..కారు, మొబైల్  ఫోన్లు, నగదు స్వాధీనం
  • రియల్  ఎస్టేట్  వ్యాపారి కిడ్నాప్
  •  కేసులో ముగ్గురు, నకిలీ కరెన్సీ కేసులో ముగ్గురు అరెస్ట్
  • పరారీలో డబ్బులు కాజేసిన గ్యాంగ్​
  • కారు, మొబైల్  ఫోన్లు, నగదు స్వాధీనం

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు; సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశకు పోయి నకిలీ కరెన్సీ కోసం రూ.5 లక్షలు చెల్లించిన ఓ ముఠా మోస పోయింది. ఆ డబ్బులను తిరిగి రాబట్టేందుకు రియల్​ ఎస్టేట్​ వ్యాపారిని కిడ్నాప్​ చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్​ పట్టణంలో కలకలం రేపగా, ఈ రెండు కేసుల్లో పోలీసులు ఆరుగురిని అరెస్ట్​ చేసి కారు, మొబైల్​ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

 మంగళవారం ఆదిలాబాద్​ డీఎస్పీ ఎల్.జీవన్​రెడ్డి మావల పోలీస్​స్టేషన్​లో మీడియాకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని పాండ్రకవడకు చెందిన ప్రతీక్  ద్వారా అదే గ్రామానికి చెందిన దీపక్  శ్రీరామ్​ పవార్, బేల మండలం దహేగాంకు చెందిన సర్కార్  అలోక్, ఆదిలాబాద్​ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన ఎల్చల్​వార్  సురేందర్ కు నాగ్‌‌‌‌పూర్‌‌‌‌కు చెందిన నకిలీ కరెన్సీ గ్యాంగ్‌‌‌‌తో పరిచయం ఏర్పడింది. 

రూ. లక్షకు రూ.4 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామని, వాటిని చలామణి చేస్తే భారీగా లాభాలు పొందవచ్చని గ్యాంగ్  నమ్మించింది. దీంతో రూ.5 లక్షలు చెల్లించి రూ.20 లక్షల నకిలీ కరెన్సీ పొందాలని వారు నిర్ణయించుకున్నారు. అంతకుమందే సురేందర్ తో పాటు మరో ఇద్దరు మహారాష్ట్రకు చెందిన షేక్  షకీబ్  వద్ద రూ.5 లక్షలు కాజేసి వాటా తీసుకోవాలనుకున్నారు.  

ఈక్రమంలో ఈ నెల 10న మావల బైపాస్  వద్ద నకిలీ కరెన్సీ గ్యాంగ్  సభ్యులకు రూ.5 లక్షలు అందజేశారు. డబ్బులు తీసుకున్న అనంతరం గ్యాంగ్  సభ్యులు నకిలీ కరెన్సీ ఉన్నట్లుగా ఒక బాక్స్  చూపించారు. ఈక్రమంలో ముందస్తు ప్లాన్​ ప్రకారం అక్కడికి చేరుకున్న నకిలీ కరెన్సీ గ్యాంగ్, కొందరు వ్యక్తులు పోలీసులమని బెదిరించి రూ.5 లక్షలతో అక్కడి నుంచి రెండు కార్లలో నాగ్‌‌‌‌పూర్  వైపు పరారయ్యారు. 

దీంతో రూ.5 లక్షలు కోల్పోయిన మహారాష్ట్రలోని గడ్​చాందూర్​కు చెందిన షేక్  షకీబ్  అలియాస్​ ఎండీ షకీబ్, మహ్మద్  సితార్,  ప్రతమ్  రవీంద్ర గురుకుందల్వార్  తమ డబ్బును తిరిగి రాబట్టేందుకు అక్కడే ఉన్న సురేందర్, అలోక్, దీపక్‌‌‌‌ను బంధించారు. సురేందర్‌‌‌‌తో అతని భార్యకు ఫోన్  చేయించి తనను కిడ్నాప్  చేశారని, రూ.5 లక్షలు చెల్లిస్తేనే విడుదల చేస్తామని అంటున్నారని చెప్పించారు. 

దీంతో సురేందర్  భార్య మావల పోలీసులను ఆశ్రయించడంతో గడ్​చాందూర్​కు చెందిన ముగ్గురిపై కిడ్నాప్​ కేసు, నకిలీ కరెన్సీ కేసులో దీపక్​ శ్రీరామ్​ పవార్, సర్కార్​ అలోక్, సురేందర్​పై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. వీరి నుంచి డబ్బులు ఎత్తుకెళ్లిన పాండర్​కవడాకు చెందిన ప్రతీక్​ గ్యాంగ్  కోసం ప్రత్యేక బృందం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ​మావల సీఐ బీడీ ప్రేమ్ కుమార్, ఎస్సై రాజశేఖర్  పాల్గొన్నారు.