న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన రెండు స్పైస్‌జెట్ విమానాలు సోమవారం 24 గంటలకు పైగా ఆలస్యమయ్యాయి. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర నిరసన తెలిపారు. విమానం బయలుదేరే టైం, ఫుడ్, వసతిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పైస్‌జెట్ చోర్ హై (స్పైస్‌జెట్ దొంగ) అంటూ నినాదాలు చేశారు. సోమ, మంగళవారాల్లో ఈ నిరసన కొనసాగింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
చాలా సేపటి వరకు స్పైస్‌జెట్ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత విమానాశ్రయ సిబ్బంది జోక్యం చేసుకుని ఫుడ్, వాటర్ ఇవ్వడంతో పాటు విశ్రాంతి కోసం ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత విమానాల రద్దుకు కారణమైన సాంకేతిక లోపాలు, ఆపరేషనల్ కారణాలపై ఎయిర్‌లైన్స్ సంస్థ క్షమాపణలు చెప్పింది.
స్పైస్‌జెట్ కు చెందిన విమానాలు ఎస్జీ 5111, ఎస్జీ 5105 ఆపరేషనల్ కారణాల వల్ల (ఒక విమానం గ్రౌండ్ కావడంతో) ఆలస్యమైనట్టు స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేస్తున్నామని, కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు.
