జనగామ, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లాలో సమర్థంగా అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దిశ కమిటీ చైర్‌పర్సన్, వరంగల్ ఎంపీ కడియం కావ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం జనగామ కలెక్టరేట్‌లో జరిగిన దిశ కమిటీ సమావేశంలో పథకాల అమలుపై సమీక్షించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ, అభివృద్ధి పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీఎం శ్రీ, మోడల్, సోషల్ వెల్ఫేర్, జడ్పీ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం మంజూరైన 84 పనుల్లో 74 పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎంపీ ల్యాడ్స్ పనులు మూడు నెలల్లో ప్రారంభం కాకపోతే రద్దు చేయాలని, నిషేధిత పారక్వాట్ గడ్డి మందు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో మానసిక వైకల్యం, రక్తహీనతను గుర్తించి నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. జాతీయ రహదారి-163పై మిస్సింగ్ సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్, మున్సిపల్ చైర్మన్లు కడకంచి బాలమణి, తాటికొండ వినయ్ కుమార్, ఆర్డీవోలు, ఇతర ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
