- బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
బషీర్‌బాగ్, వెలుగు: దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణనలో బీసీల కులాల వారీగా లెక్కలు సేకరించాలని తెలంగాణ బీసీ జేఏసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గతంలో బీసీ కులగణన చేపడతామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని జేఏసీ నాయకులు విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి నేతృత్వంలో మంగళవారం బషీర్‌బాగ్ చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీగా మారిందని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని, జనగణనలో బీసీల కులాల వారీగా లెక్కలు సేకరించే అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు.
బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్‌కుర్మ మాట్లాడుతూ.. గతంలో రూపొందించిన ప్రశ్నావళిని రద్దు చేసి, ఓబీసీ కాలమ్‌తో కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని డిమాండ్ చేశారు.
బీసీ కులగణన చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళితే బీజేపీలోని బీసీ కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ నేతల ఇళ్లను ముట్టడించడంతో పాటు వారి పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
